Begin typing your search above and press return to search.

వారి బాధంతా అక్రమార్జన పోయిందనేనా!?

By:  Tupaki Desk   |   9 April 2015 10:30 PM GMT
వారి బాధంతా అక్రమార్జన పోయిందనేనా!?
X
'కూలీలను కాల్చేశారు' అంటూ కొంతమంది తెగ బాధ పడిపోతున్నారు. 'పట్టుకెళ్లి చంపేశారు' అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. చేతుల్లో దుంగలు ఉన్న కూలీలు పోలీసులపైకి ఎలా ఎదురు దాడి చేస్తారు? అంటూ లాజిక్కులు లాగుతున్నారు. అయితే, వారి బాధ, ఆవేదన, ఆందోళన అంతా అక్రమార్జన పోతుందనేనని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. కూలీలు అడవిలోకి వెళ్లి దుంగలను కొట్టుకొస్తే స్మగ్లర్లు వాటిని స్మగ్లింగ్‌ చేస్తున్నారని, మధ్యలో కొంతమందికి మామూళ్లు అందుతున్నాయని, ఆ అక్రమార్జన పోతుందనే కొంతమంది ఇప్పుడు తెగ బాధ పడిపోతున్నారని స్పష్టం చేస్తున్నారు.

శేషాచలం అడవుల్లోని ఎన్‌కౌంటర్‌ గురించి ప్రభుత్వానికి ముందు రోజే తెలుసునని, అంతా పథకం ప్రకారమే జరిగిందని కూడా కొంతమంది ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. మృతులందరినీ ముందురోజే అదుపులోకి తీసుకున్నారని బంధువులు అంటున్నారని కొంతమంది నాయకులు ఆరోపించారు. వాస్తవానికి, కూలీలు కానీ స్మగ్లర్లు కానీ ఒకసారి అడవిలోకి వస్తే నాలుగైదు రోజులపాటు అక్కడే ఉంటారు. వారికి ఎవరితోనూ సంబంధాలు కూడా ఉండవు. అడవిలో ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటే జవ్వాది కొండల్లో ఉన్న బంధువులకు ఆ విషయం ఎలా తెలిసింది!? అని ప్రశ్నిస్తున్నారు. మృతుల్లో ఏడుగురిని ముందు రోజు బస్సుల్లో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారని అటువంటప్పుడు ఎక్కడో ఒకచోట పోలీసు కేసో ఫిర్యాదో నమోదై ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.

దుంగలు మోస్తూ దాడులు ఎలా చేశారని.. కాల్పులు జరుగుతున్నా పారిపోలేదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, శేషాచలం అడవుల్లో దాదాపు 500 మంది స్మగ్లర్లు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అంతమంది ఉన్నప్పుడే పోలీసులు వారికి ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా జరిగిన దాడుల్లోనే కొంతమంది మరణించారు. మిగిలినవారు దుంగలను అక్కడ వదిలేసి పారిపోయారు. వారి కోసమే ఇప్పుడు టాస్క్‌ఫోర్స్‌ గాలింపు జరుపుతోంది.

కొన్ని వేలు, వందల కోట్ల రూపాయల జాతి సంపదను దోపిడీ చేస్తుంటే ఎప్పుడూ ప్రశ్నించని వారంతా ఇప్పుడు హక్కుల పరిరక్షణ అంటూ గొంతు చించుకుంటున్నారని, వారి బాధ అంతా హక్కుల సాధన కాదని, వారి అక్రమార్జన పోతోందన్న బాధేనని విమర్శిస్తున్నారు