Begin typing your search above and press return to search.

తిరుపతి సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు

By:  Tupaki Desk   |   11 Dec 2021 12:03 PM IST
తిరుపతి సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు
X
మహాపాద యాత్ర ముగింపులో ఈనెల 17వ తేదీన నిర్వహించాలని అనుకున్న బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండ్ తో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో న్యాయస్ధానం టు దేవస్ధానం పేరుతో పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే.తిరుపతిలో ఈనెల 17వ తేదీన పాదయాత్ర ముగుస్తుంది. ఆ సందర్భంగా భారీ బహరంగసభ జరపాలని రాజకీయపార్టీలు నిర్ణయించాయి.

తెలుగుదేశంపార్టీ, బీజేపీ, జనసేన, వామపక్షాల నేతల ఆధ్వర్యంలో బహిరంగసభ జరపాలని డిసైడ్ అయ్యింది. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి నిరాకరించటాన్ని పార్టీలు, పాదయాత్ర చేసిన వాళ్ళు రాజకీయం చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాదయాత్రకు మాత్రమే నిర్వాహకులకు అనుమతుంది. అదికూడా కోర్టు ఆదేశాలతో మాత్రమే పోలీసులు అనుమతించారు. యాత్రకు అనుమతి అడిగిన నిర్వాహకులు బహిరంగసభకు కోర్టు అనుమతి తీసుకోలేదు.

యాత్ర ముగింపుకొచ్చిన సమయంలో అనుమతి ఒకదానికి తీసుకుని బహిరంగసభ కూడా నిర్వహిస్తామంటే పోలీసులు ఎందుకు అనుమతిస్తారు ? బహిరంగసభ కూడా నిర్వహించాలని అనుకంటే మళ్ళీ కోర్టుకెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిందే.

అందరికీ తెలిసిన ఇంతచిన్న విషయాన్ని కూడా రాజకీయపార్టీలు ఇపుడు రాజకీయం చేస్తున్నాయి. అలాగే తిరుమల దర్శనం విషయాన్ని కూడా రాజకీయం చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

తిరుమలో శ్రీవారి దర్శనం కోసం తాము దరఖాస్తు చేసుకంటే టీటీడీ ఈవో స్పందించలేదని ఆరోపణలు చేయటంలో కూడా అర్ధంలేదు. వీళ్ళు దర్శనం చేసుకోవాలంటే ఈవోకు దరఖాస్తు చేసుకోవటమే విచిత్రంగా ఉంది.

ప్రతినెలలో భక్తుల దర్శనం కోసం టీటీడీ వేలాది టికెట్లను ఆన్ లైన్లో పెడుతోంది. దాని ప్రకారం దర్శనానికి వెళ్ళదలచుకున్న వాళ్ళు ఆన్ లైన్లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్లో టికెట్లు దొరుకుతున్నపుడు ఈవోకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏముంది ?

తాము దర్శనం కోసం దరఖాస్తు చేసుకుంటే ఈవో స్పందించరని పాదయాత్ర నిర్వాహకులకు ముందే తెలుసు. తెలిసి కూడా దరఖాస్తు చేసుకున్నారంటే చివరకు శ్రీవారి దర్శనాలను కూడా రాజకీయం చేయాలన్న ఆలోచన మాత్రమే కనబడుతోంది.

ఎవరి సిఫారసు లేకుండానే దర్శనం చేసుకునే అవకాశాన్ని వదిలేసి ఈవో స్పందించటం లేదని గోల చేయటంలో ఉద్దేశ్యం స్పష్టమవుతోంది. మరి బహిరంగసభ నిర్వహణలో కోర్టుకెళతారా ? కోర్టేమంటుందో చూడాలి.