Begin typing your search above and press return to search.

బెజవాడ పోలీసులు భేష్.. 7 కిలోల బంగారం కొట్టేసినోడ్ని గంటల్లో పట్టేశారు

By:  Tupaki Desk   |   25 July 2020 10:00 AM IST
బెజవాడ పోలీసులు భేష్.. 7 కిలోల బంగారం కొట్టేసినోడ్ని గంటల్లో పట్టేశారు
X
ఊహించని రీతిలో జరిగిన దోపిడీ బెజవాడలో సంచలనంగా మారింది. పక్కా ప్లాన్ వేసి దోచేసిన ఈ గోల్డ్ చోరీ హాట్ టాపిక్ గా మారింది. బంగారు వర్తకల్లో భయాన్ని పెంచేలా చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని గంటల వ్యవధిలోనే ఒక కొలిక్కి తీసుకురావటమే కాదు.. నిందితుల్నిఅదుపులోకి తీసుకున్నబెజవాడ పోలీసుల సామర్థ్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇంతకూ జరిగిందేమంటే..

విజయవాడ వన్ టౌన్ (దీన్ని పాతబస్తీగా అభివర్ణించే వారు లేకపోలేదు) లో పెద్ద ఎత్తున వ్యాపార సముదాయాలు ఉంటాయి. అన్ని రకాల ఉత్పత్తులు భారీగా లభిస్తాయి. చివరకు బంగారం సైతం కూడా. బడా వ్యాపారులకు అడ్డాగా ఉండే ఈ ప్రాంతంలోనే బంగారు హోల్ సేల్ వర్తకులు ఉంటారు. తాజాగా కాటూరి వారి వీధిలోని సాయిచరణ్ జ్యూయలర్స్ లో బంగారం దోపిడీ జరిగింది. ఈ షాపుకు కేర్ టేకర్ గా విక్రమ్ లోహార్ అనే వ్యక్తిని యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ షాపునకు ఇద్దరు కేర్ టేకర్స్ఉంటారు. రెండో కేర్ టేకర్ వచ్చే సమయానికి మొదటి కేర్ టేకర్ విక్రమ్ గాయాలతో పడి ఉన్నాడు.

తాళ్లతో కట్టేసి.. బ్లేడ్ తో కోసిన వైనంతో పాటు.. పెద్ద ఎత్తున బంగారం.. క్యాష్ మిస్ అయినట్లుగా గుర్తించారు. తనపై దాడికి పాల్పడి ఈ చోరీ జరిగినట్లుగా వాపోయాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన వారు.. దొంగతనం జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. సీసీ కెమేరా పుటేజ్ పరిశీలించగా.. అదంతా డ్యామేజ్ అయినట్లుగా గుర్తించారు. దీంతో వేలిముద్ర నిపుణుల్ని రంగంలోకి దించారు.

వారు సునిశితంగా పరిశీలించి.. బాధితుడిగా కనిపిస్తున్న విక్రమేఈ భారీ దోపిడీకి పాల్పడినట్లుగా గుర్తించారు. తాళ్లతో తనను తానే కట్టుకొని.. బ్లేడ్ తో గాయాలు కూడా తానే చేసుకున్నట్లుగా గుర్తించారు. బయట వారి ప్రమేయం లేకుండా తనను తానే దాడి చేసుకొని దొంగతనం ఎపిసోడ్ తో భారీగా సొమ్ము చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేసినట్లుగా భావించాడు కానీ పోలీసుల తెలివి ముందు తన చావుతెలివి తేలిపోతుందన్న విషయాన్ని గంటల వ్యవధిలోనే బెజవాడ పోలీసులు గుర్తించి.. రికవరీ చేశారు. ఈ భారీ చోరీని కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించటంపై పోలీసుల మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.