Begin typing your search above and press return to search.

భట్టి దీక్ష భగ్నం.. నిమ్స్ కు తరలింపు

By:  Tupaki Desk   |   10 Jun 2019 10:44 AM IST
భట్టి దీక్ష భగ్నం.. నిమ్స్ కు తరలింపు
X
టీఆర్ ఎస్ లో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఉదయం దీక్ష కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నిమ్స్ కు తరలించారు.

భట్టి దీక్ష భగ్నం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పెద్ద ఎత్తున రాగా.. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి భట్టిని అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు.

భట్టి ఆమరణ దీక్షకు దిగడంతో ఆదివారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు తరలివచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భట్టి కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. దేశంలో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు నలుగురు ఉంటే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోతుందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేసేంత వరకు దీక్ష విశ్రమించనని ప్రకటించారు.

సోమవారం వరకు దీక్షకు అనుమతిచ్చిన పోలీసులు ఆ గడువు ముగిసిపోవడం.. భట్టి ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం దీక్షను భగ్నం చేశారు. అయితే దీక్ష భగ్నమైన తమ పోరాటం కొనసాగుతుందని భట్టి స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని.. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని.. న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం టీఆర్ ఎస్ ఆకర్ష్ తో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి భట్టి పోరాటం.. ఆమరణ దీక్ష కాస్త మైలేజ్ ను ఇచ్చింది. న్యాయపోరాటం చేస్తే సీఎల్పీ విలీనం కూడా వీగిపోతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.