Begin typing your search above and press return to search.

ప్రతిపక్షం బంధీ.. తెలంగాణలో పరిస్థితిదీ..

By:  Tupaki Desk   |   29 April 2019 6:55 AM GMT
ప్రతిపక్షం బంధీ.. తెలంగాణలో పరిస్థితిదీ..
X
తెలంగాణలో ‘ఇంటర్’ మంటలు ఆరడం లేదు.. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నిర్లక్ష్యం 23మంది విద్యార్థుల ఆత్మహత్యలు.. రోడ్డెక్కిన విద్యార్థులు,తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు.. వారికి మద్దతుగా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు... ఎక్కడా తగ్గడం లేదు. ఇంటర్ మూల్యంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

*అఖిలపక్షం ఇంటర్ బోర్డ్ ముట్టడికి యత్నం
సోమవారం ఇంటర్మీడియెట్ ముట్టడికి అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ఫలితాల్లో తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ తో ఇంటర్ బోర్డ్ ముట్టడికి ఈ ఉదయం కాంగ్రెస్- టీడీపీ- సీపీఐ- సీపీఎం- టీజేఎస్- జనసేన పార్టీలు బయలు దేరాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ కూడా నిరవధిక దీక్షకు దిగుతున్నారు.. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు, నిర్బంధాలకు దిగుతున్నారు.

* ముందస్తు అరెస్ట్ లు, నిర్బంధాలు
తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ ఇంటర్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఈరోజు ఉదయం ముందస్తు అరెస్ట్ లు చేశారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇంటర్ బోర్డ్ ముట్టడికి వస్తున్న టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి నారాయణ గూడ పీఎస్ కు తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలను గృహనిర్బంధం చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు కాపాల కాస్తున్నారు. నల్గొండ జిల్లాలో హైదరాబాద్ వెళ్తున్న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీలో కాంగ్రెస్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నాయకుల ముందస్తు అరెస్ట్ లు , నిర్బంధాలు కొనసాగుతున్నాయి.

* పోరాటం ఆగదంటున్న ప్రతిపక్షాలు
ఇంటర్ బోర్డు ముట్టడికి బయలు దేరుతున్న నేతల అరెస్ట్ పై పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఉద్యమాలను ఆపలేరని.. అరెస్ట్ చేసిన వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ పోరాటాన్ని ఉదృతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముందస్తు అరెస్ట్ లు, నిర్బంధాలను కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డిలు ఖండించారు.