Begin typing your search above and press return to search.

శరవేగంగా పోలవరం.. ఏపీ కల సాకారం దిశగా..

By:  Tupaki Desk   |   25 Jun 2020 1:31 AM GMT
శరవేగంగా పోలవరం.. ఏపీ కల సాకారం దిశగా..
X
ఏపీ కలల ప్రాజెక్టు వడి వడిగా ముందుకెళ్తోంది. సాకారం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వలస కార్మికులను ప్రత్యేక రైళ్లలో తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టులో భారీ క్రేన్లు, రెడీమిక్చర్లు, వందల కొద్దీ కార్మికులతో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు చకచకా సాగుతున్నాయి.

స్పిల్ వేలో రోజుకు 1000 క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పనులు చేస్తున్నామని.. మే 2021 నాటి 48 గేట్లను బిగించి స్పిల్ వేను పూర్తి చేస్తామని పనులు పర్యవేక్షిస్తున్న ఎస్ఈ నాగిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం వరదలు తగ్గగానే నవంబర్ లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లో ఖాళీని భర్తీ చేసి నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి గోదావరి డెల్టాల పంటలకు ఇబ్బంది లేకుండా చేస్తామని.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లను జూలై 2021 నాటికి పూర్తి చేస్తామని.. ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ప్రారంభించి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

దశాబ్ధాలుగా ఎందరో ముఖ్యమంత్రులు మారినా పోలవరం గతి మారలేదు. గత చంద్రబాబు పాలనలోనూ కమీషన్ల దందాగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఏపీ సీఎం జగన్ బాధ్యతలు చేపట్టగానే ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేశారు. రివర్స్ టెండరింగ్ తో ఖజానాకు రూ.838.51 కోట్లను ఆదా చేశారు. తాజాగా 2021 లోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. స్పిల్ వే, స్పిల్ చానల్, నిర్వాసితులకు పునరావాసం, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్రణాళికలను సీఎం జగన్, మంత్రి అనిల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండడం వల్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి.

మహమ్మారి లాక్ డౌన్ వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలి పోవడం తో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భరోసా కల్పించి ప్రాజెక్టు పనుల్లోకి తిరిగి రప్పించాయి. మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ పోలవరం పనులను శర వేగంగా పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం స్పిల్ వేలో వెయ్యి క్యూబిక్ మీటర్లు, స్పిల్ చానెల్ లో రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ప్రతీరోజు చేస్తున్నారు. ఈ పనులు మే 2021 నాటికి పూర్తవుతాయి.

ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ చైనా నిర్మించిన ‘త్రీగోర్జెస్’. ఇది ప్రపంచంలోనే గరిష్టంగా 35 లక్షల క్యూసెక్కుల వరద జలాలను విడుదల చేసే సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చైనాను దాటేసి అంతకుమించి 50 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేను నిర్మిస్తుండడం విశేషంగా మారింది. ప్రపంచంలోనే ఇసుక తిన్నెలపై అతి పొడవైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఇదే.. పోలవరం పూర్తయితే మొత్తం 38.70 లక్షల ఎకరాలకు ఏపీ మొత్తం నీరందుతుంది. ప్రపంచంలోనే గరిష్టంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగా ఇది రికార్డును సృష్టించనుంది.

దివంగత వైఎస్ఆర్ నడుం బిగించిన పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని.. 2022 జూన్ నాటికి ఆయకట్టుకు నీళ్లందిస్తామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరాన్ని వైఎస్ఆర్ ప్రారంభిస్తే.. ఆయన తనయుడి చేతులు మీదుగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని తెలిపారు.