Begin typing your search above and press return to search.

పోలవరం రివర్స్ టెండరింగ్.. ఎందుకు? ఈ ప్రకారం మంచిదే!

By:  Tupaki Desk   |   18 Aug 2019 8:37 AM GMT
పోలవరం రివర్స్ టెండరింగ్.. ఎందుకు? ఈ ప్రకారం మంచిదే!
X
పోలవరం ప్రాజెక్టు పై రివర్స్ టెండరింగ్ విషయంలో పలు సందేహాలు, కొన్ని ఆక్షేపణలున్నాయి. ఈ ఆక్షేపణలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నవే. తమ హయాంలో కుదిరిన కాంట్రాక్టర్లను జగన్ సర్కారు వెనక్కు పంపడం పట్ల తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు చెబుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి బోలెడంత మీడియా బలం ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆక్షేపణలు తటస్థుల్లో కూడా కొన్ని సందేహాలను జనింపజేస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ అంశంపై తుపాకీ డాట్ కామ్ కొంత కూలంకశమైన విశ్లేషణను అందిస్తూ ఉంది.

-పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ముందుగా ట్రాన్స్ ట్రాయ్ సంస్థ పొందింది. రెండు వేల పదమూడులో పనులు ప్రారంభం అయ్యాయి. అప్పటికి అంచనా వ్యయం నాలుగు వేల కోట్ల రూపాయల చిల్లర. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంచనా వ్యయంలో మొదటి సవరణ చేశారు. పనులు ఒక కొలిక్కి కూడా రాకముందే అంచనా వ్యయాన్ని ఐదు వేల కోట్ల రూపాయలకు దాటిచ్చారు.

-అలా మూడున్నరేళ్లు కాలయాపన అనంతరం ట్రాన్స్ ట్రాయ్ దివాళా దశకు వచ్చింది. ఆఖరికి సిబ్బందికి జీతభత్యాలు కూడా చెల్లించుకోలేకపోయారు. దీంతో ఆ సంస్థను తప్పించారు.

-నిబంధనల ప్రకారం అయితే మళ్లీ కొత్త కాంట్రాక్టర్ ను పిలవాలి. అయితే ఒప్పందాలను రద్దు చేసుకోకుండా నవయుగ-బీకెమ్ లకు నామినేషన్ పద్ధతిన కాంట్రాక్టులను అప్పగించేశారు!

-అయితే ఈ సంస్థలకు కూడా ప్రభుత్వమే ఇసుక సమకూర్చడం, సిమెంట్ కొనిస్తుంది! ఇది కూడా నిబంధనలకు విరుద్ధమే. ఆపై అంచనాలను భారీగా పెంచారు.

-ఈ నేపథ్యంలో ఆ అక్రమాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెబుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ కు శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

-ఇప్పుడు ఆన్ లైన్ పద్ధతిలోనే పోలవరం ప్రాజెక్టులకు కొత్త కాంట్రాక్టర్ ఎంపిక సాగనుంది. రివర్స్ టెండరింగ్ ద్వారా భారీ మొత్తం అంచనా వ్యయం కూడా తగ్గుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

-ఇక ఈ మొత్తం తతంగంతో పోలవరం నిర్మాణం లేట్ అవుతుంది అనేది మరో అభియోగం. అయితే ప్రస్తుత వర్షకాలంలో పనులు సాగే అవకాశం లేదు. ఎవరు కాంట్రాక్టులో ఉన్నా మరో రెండు నెలల వరకూ పనులు జరగవు కూడా. ఈ నేపథ్యంలో పోలవరం కాంట్రాక్టర్ ఎంపిక చేసి, ఇక పనులను పరిగెత్తిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతూ ఉంది.

-ప్రస్తుత కాంట్రాక్టర్లు ఇది వరకూ పెట్టిన డెడ్ లైన్ కు తగ్గట్టుగా పనులను పూర్తి చేయలేకపోయారు కూడా. ఈ నేపథ్యంలో మార్పు మంచిదే అని చెప్పాలి.

-కాళేశ్వరం ప్రాజెక్టులా రెండేళ్ల వ్యవధిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం కూడా రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడాన్ని చాలెంజింగ్ తీసుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.