Begin typing your search above and press return to search.

కరోనాకు సంబంధించి షాకింగ్ నిజాన్ని వెల్లడించిన పోలాండ్

By:  Tupaki Desk   |   15 Jan 2022 4:51 AM GMT
కరోనాకు సంబంధించి షాకింగ్ నిజాన్ని వెల్లడించిన పోలాండ్
X
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మూడో వేవ్ సాగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకోగా.. మరికొన్ని దేశాల్లో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పోలాండ్ శాస్త్రవేత్తలు కరోనాకు సంబంధించి అత్యంత కీలకమైన అంశాన్ని గుర్తించారు. ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోవటం.. కొన్ని ప్రాంతాల్లో దీని తీవ్రతకు పిట్టల్లా ప్రజలు చనిపోవటం తెలిసిందే. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతికారు పోలాండ్ శాస్త్రవేత్తలు.

వారు జరిపిన పరిశోధనలో.. కరోనా మహమ్మారి కొందరి మనుషుల్లో ఉండే ఒక కీలక జన్యువును గుర్తించారు. ఈ జన్యువు ఉన్న వారికి కరోనా మరణశాసనంగా మారుతుందని గుర్తించారు. పోలాండ్ కుచెందిన బయాలిస్టోక్ మెడికల్ వర్సిటీ పరిశోధనల ప్రకారం పోలాండ్ వాసుల్లో దాదాపుగా 14 శాతం మందికి ఈ జన్యువు ఉంది. అదే.. యూరోప్ దేశస్తులకు 9 శాతం.. అదే భారత్ లో అయితే 27 శాతం మందిలో ఈ జన్యువు ఉంటుంది.

ఈ జన్యువు ఉన్న వారికి కరోనా కారణంగా ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. కరోనాతో ఎవరికి ఎక్కువ ముప్పు ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టారు. వైరస్ బారిన పడి.. తీవ్ర అనారోగ్య తీవ్రతను నిర్ణయించే విషయంలో వయసు.. బరువు..లింగ భేదం తర్వాత ఈ జన్యువు నాలుగోకీలక అంశంగా పరిశోధకులు గుర్తించారు.

ఈ పరిశోధన ఫలితం చేసే మేలేమిటంటే.. కరోనా పరీక్షలో పాజిటివ్ అన్న విషయం తేలిన వెంటనే.. వారికి జన్యు పరీక్షలు జరిపి.. శాస్త్రవేత్తలు గుర్తించిన జన్యువు ఉందో లేదో గుర్తిస్తారు. తద్వారా వారికి అందించే వైద్య సాయాన్ని మార్చేందుకు వీలుంటుంది. దీని వల్ల.. వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రం కాకముందే.. వారిని ఆ అపాయం నుంచి బయట పడేసే అవకాశం ఉంటుంది. కరోనాతో పోలాండ్ లో ఇప్పటికి లక్ష మంది మరణించారు.

ఇక.. కరోనా సోకిన వారిలో మరణ ప్రమాదానికి కారణమయ్యే జన్యువును పోలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించటం ఒక ఎత్తు అయితే.. గతంలోనే ఆక్స్ ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు.. ''ఎల్ జెడ్ టీ ఎఫ్ ఎల్1'' (LZTFL1) జన్యువు ఉన్న వారికి కరోనా సోకితే.. ఊపిరితిత్తుల వైఫల్యానికి గురై.. మరణించే అవకాశం ఉందన్న విషయాన్ని గర్తించారు. ఇదంతా చూస్తే.. రానున్న రోజుల్లో ఒకేసారి కరోనా పాజిటివ్ పరీక్ష.. వారి జన్యు పరీక్షను చేస్తే.. మహమ్మారిని మొదట్లోనే పూర్తిగా అణిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక విధంగా కరోనా ఎపిసోడ్ లో ఇదో పెద్ద బ్రేక్ త్రూగా చెప్పక తప్పదు.