Begin typing your search above and press return to search.

మ్యాప్ లో ఆ ఎర్రగీత పోతుందట

By:  Tupaki Desk   |   20 Aug 2016 9:37 AM GMT
మ్యాప్ లో ఆ ఎర్రగీత పోతుందట
X
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని మోడీ సర్కారు చేస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్ ఇష్యూలో దాయాది పాక్ తీరును తీవ్రంగా ప్రశ్నించేందుకు తడబడే గత ప్రభుత్వాలకు భిన్నంగా కశ్మీర్ విషయంలో పాక్ జోక్యాన్ని గట్టిగా నిలదీయటమేకాదు.. పాక్ కు నేరుగా నొప్పిపుట్టేలా పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇష్యూను తెర మీదకు తీసుకురావటమే కాదు.. ఆ దేశానికి మంట పుట్టేలా బలూచిస్థాన్ వ్యవహారాన్ని టచ్ చేయటం మోడీ సర్కారుకే సాధ్యమైందని చెప్పాలి.

ఇలాంటి వేళ.. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇష్యూలో మోడీ తీరుకు మరింత దూకుడుతనాన్ని ప్రదర్శించిన ఆయన.. పాక్ ఆక్రమిత కశ్మీర్ కు స్వాతంత్ర్యం ఆసన్నమైందని.. అది త్వరలోనే భారత్ లో భాగం కానుందంటూ సంచలన వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ కశ్మీర్ విషయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యకు కౌంటర్ అన్నట్లుగా యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ఉండటంతో పాటు.. పాక్ కు ఒళ్లు మండిపోయేలా మాట్లాడారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడటమే ఇప్పటివరకూ ఎక్కువ అనుకుంటే.. అంతకు మించి అన్నట్లుగా యోగి ఏకంగా ఆ భాగం భారత్ లో విలీనం అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పటం ద్వారా మోడీ సర్కారు తదుపరి లక్ష్యం గురించి చెప్పేశారా? అన్న భావన కలగటం ఖాయం.

దేశ విభజనకు కారణమైన జిన్నా పెండింగ్ ఉత్తర్వుల్ని పాటిస్తూ కశ్మీర్ కు సైనికుల్ని పంపాలంటూ ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ పాక్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో యోగి వ్యాఖ్యలు మరింత ఘాటుగా ఉన్నాయి. తలో మాదిరి పాక్ ఏం చేసినా ‘ఖండింపు’ మాటలతో కాలం గడపటంలాంటివి ఉండవన్న సంకేతాలు ఇవ్వటమే కాదు అప్పుడెప్పుడో చేజారిన పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలో సొంతం కానుందన్న సంచలన వ్యాఖ్య చేయటం గమనార్హం. ఇప్పుడున్న ఇండియా మ్యాప్ లో పాక్ అక్రమిత కశ్మీర్ అన్న విషయాన్ని తెలిపే ఎర్ర గీత ప్రతి భారతీయుడి కన్ను మండేలా చేస్తుంది.తాజాగా బీజేపీ ఎంపీ మాటలు వింటుంటే ఇంతకాలం చిరాకు పుట్టించిన ఆ ఎర్రగీత చెరిగిపోయే రోజు దగ్గర్లోనే ఉందన్న సగటు భారతీయుడికి సంతోషాన్నిస్తుందనటంలో సందేహం లేదు. చేతకానితనంతో అప్పుడెప్పుడో పోయింది ఇప్పుడు జాగ్రత్తగా తెచ్చి ఇస్తామంటే ఎవరికి మాత్రం ఆనందం ఉండదు?