Begin typing your search above and press return to search.

పీవోకే మీద మరింత క్లారిటీ..వెనక్కి తగ్గేదే లేదు

By:  Tupaki Desk   |   18 Sep 2019 8:55 AM GMT
పీవోకే మీద మరింత క్లారిటీ..వెనక్కి తగ్గేదే లేదు
X
భారత్ మారుతోంది. మోడీ నాయకత్వంలో భారత్ రూపురేఖలు మారిపోనున్నాయా? మొన్నటి వరకూ ఒద్దికగా.. పద్దతిగా.. వివాదాల విషయంలో ఆచితూచి అన్నట్లు అడుగులేసే తీరుకు భిన్నంగా వ్యవహరిస్తోంది మోడీ సర్కారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడటానికి గొంతు పెగలని గత ప్రభుత్వాలకు భిన్నంగా ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేసిన మోడీ సర్కారులోని పలువురు కీలక నేతల కారణంగా పీవోకే మీద కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

న్యాయబద్ధంగా మనదైన పాక్ అక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలిపే పని ఎప్పటికైనా సాధ్యమేనా? అన్న సందేహానికి తెర దించుతూ మోడీ ప్రభుత్వం ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉందన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ అంతర్భాగమేనని.. ఏదో ఒక రోజు దీనిని దేశ భౌగోళిక అధికార పరిధిలోకి తీసుకొచ్చేస్తామని.. అందులో అనుమానం ఏమీ లేదంటూ తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చేసిన ప్రకటన ఇప్పుడు తాజా సంచలనమైంది.

మోడీ బర్త్ డే వేళ.. ఆయన చేసిన ప్రకటన అంతర్జాతీయ సమాజానికి కొత్త సందేశాన్ని తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. పీవోకే మీద ఇప్పటివరకూ వచ్చిన ప్రకటనలకు ఈ ప్రకటనకూ తేడా ఉందంటున్నారు. పాక్ తో చర్చలు జరిగితే అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదనేనని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు ఇప్పటికే స్పష్టం చేసిన వేళ.. పీవోకే భౌగోళికంగా దేశ అధికార పరిధిలోకి వచ్చేస్తుందన్న మాట వెనుక చాలానే అర్థాలు ఉన్నాయంటున్నారు.

కొద్ది రోజుల్లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ కొలువు తీరుతున్న వేళ.. విదేశాంగ మంత్రి నోటి నుంచి వస్తున్నఈ మాటలు కొత్త దిశగా సాగుతున్నట్లుగా చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మోడీ.. ఇమ్రాన్ లు పాల్గొననుండటం.. వారిద్దరూ కశ్మీర్ మీద మాట్లాడతారన్న మాట వినిపిస్తున్న వేళ.. పీవోకే మీద కేంద్ర సర్కారు తీరును స్పష్టం చేయటం చూస్తే.. తమ ప్రభుత్వం పీవోకే మీద ఎంత కమిట్ మెంట్ తో ఉందన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఐక్యరాజ్య సమితి జనరల్ బాడీ మీటింగ్ లో పీవోకే ప్రస్తావనతో పాటు.. భారత్ కు జరిగిన అన్యాయంపై మోడీ గళం విప్పే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు. అదే కానీ జరిగితే.. పీవోకే గురించి ఇంత బాహాటంగా మాట్లాడిన ప్రభుత్వంగా చరిత్రలోనిలిచిపోవటమే కాదు.. భారత ప్రజలు మోడీపై ఆరాధన పీక్స్ కు చేరటం ఖాయమని చెప్పక తప్పదు. 2024 ఎన్నికల ఎజెండా సిద్ధం చేయటంలో పీవోకే కీలకభూమిక పోషించటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.