Begin typing your search above and press return to search.

వైమానిక దళపతి సంచలన వ్యాఖ్యలు విన్నారా?

By:  Tupaki Desk   |   2 Sep 2016 4:54 AM GMT
వైమానిక దళపతి సంచలన వ్యాఖ్యలు విన్నారా?
X
దాయాదిపై గతంలో ఎప్పుడూ లేనంత దూకుడుగా వెళుతున్న మోడీ సర్కారుకు తగ్గట్లే తాజాగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై సగటు భారతీయుడు ఊహించని వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అత్యున్నత రాజకీయ నేతల నోటి నుంచి ఆచితూచి వచ్చే పీవోకే అంశంపై వైమానిక దళపతి సంచలన వ్యాఖ్యలుచేయటమే కాదు.. గత ప్రభుత్వాలు చేసిన తప్పును సూటిగా చెప్పేయటం ఆసక్తికరంగా మారింది.

పాక్ తో జరిగిన యుద్ధంలో విజయం సాధించినప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను చేజార్చుకోవటంపై జాతి జనుల్లో ఉన్న అసంతృప్తిని ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రాహ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. మోడీ సర్కారు మనసులో ఉన్నదేమిటన్న విషయం లీలగా అర్థమయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. అత్యున్నత నైతిక విలువల పేరుతో చేతులు కట్టేసుకోవటమే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను చేజార్చుకోవటానికి అవకాశాన్ని ఇచ్చిందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘‘సైనిక పరిష్కార మార్గంలో పయనించి ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పుడో భారత వశమయ్యేది. 1971 లో జరిగిన భారత్ – పాక్ యుద్ధంలో మినహా మరెప్పుడూ వైమానిక దళాన్ని పూర్తిస్థాయిలో వినియోగించలేదు. పీవోకే అంశం మనల్ని ముల్లుగా గుచ్చుతోంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతంలో భద్రతా అవసరాల పట్ల పాటించాల్సిన విధానాల్ని పాటించలేదన్న విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో కుండ బద్ధలు కొట్టారు. 1974లో దురాక్రమదారులు జమ్మూకశ్మీర్ పై దాడికి పాల్పడినప్పుడు భారత వైమానిక దళాలకు చెందిన రవాణా విమానాలు సైనికుల్ని యుద్ధభూమికి తరలించినా.. కళ్ల ముందున్న సైనిక పరిష్కారాన్ని వదిలేసిన.. సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలంటూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయకారణాలతో 1965 తర్వాత వైమానిక శక్తిని ఉపయోగించలేదన్న విషయాన్ని ప్రస్తావించిన రాహా.. తూర్పు పాకిస్థాన్ నుంచి పాక్ వైమానిక దళం మన వైమానిక స్థావరాలు.. మౌలిక వసతులు.. నేల మీదున్న విమానాల్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసినా.. మనం ఊరకుండిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 1971 యుద్ధంలో మాత్రమే వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించారని.. త్రివిధ దళాల్ని చక్కగా మిక్స్ చేయటంతో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన విషయాన్ని గుర్తు చేశారు. ముల్లులా తగులుతున్న పాత గాయం మానేలా చేసేందుకు కసరత్తు ఏదైనా మొదలైందా..? అలాంటిదేమీ లేకుండా ఇంతటి సంచలన వ్యాఖ్యలు ఎయిర్ చీఫ్ మార్షల్ నోటి నుంచి రావటమా? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.