Begin typing your search above and press return to search.

తెలంగాణ వ్యాప్తంగా విషజ్వరాల విజృంభణ !

By:  Tupaki Desk   |   9 Sept 2021 1:35 PM IST
తెలంగాణ వ్యాప్తంగా విషజ్వరాల విజృంభణ !
X
ఓ కరోనా మహమ్మారి పీడ ఇంకా పూర్తిగా తొలగిపోకముందే , మరోవైపు సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రజలని ఆందోళనకి గురిచేస్తున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీకి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. నిత్యం 40 నుంచి 50 ఉండే ఓపీ.. ప్రస్తుత సీజన్‌లో 70 నుంచి 80కి పెరిగింది. ఇక అంబర్ పేట నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నాలుగు బస్తీ దవాఖానాలకు సామాన్య రోగుల సంఖ్య తాకిడి ఎక్కువైంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జ్వరాల భారిన పడిన ప్రజలు ప్రైవేట్‌ ఆసుపత్రులకూ పరుగులు తీస్తున్నారు. ఈ సీజన్‌ లో డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా, టైఫాయిడ్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి.

గత 20 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణ, పారిశుధ్య నిర్వహణలో జరుగుతున్న వైఫల్యంతోనే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. సీజన్‌ వ్యాధులు ప్రబలుతుండటంతో బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు బస్తీ దవాఖానాల్లో వైద్యులు ఓపీ చూస్తున్నారు. సాధారణ జనంతో పాటు ఇతర జ్వరాలను గుర్తించి చికిత్స అందించడంతో పాటు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేస్తున్నారు. నియోజకవర్గంలో అంబర్‌ పేట మున్సిపల్‌ కాలనీ, బాగ్‌ అంబర్‌పేట అయ్యప్ప కాలనీ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెహ్రూనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఫీవర్‌ ఆసుపత్రిలో వెనుకాల ఉన్న తిలక్‌ నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యానగర్‌ డీడీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓపీతో పాటు వైద్య పరీక్షల శాంపిళ్లు సేకరించి చికిత్స నిర్వహిస్తున్నారు.

ఆయా డివిజన్లలో ఉన్న బస్తీ దవాఖానాల్లో సైతం వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ కేంద్రానికి పంపిస్తున్నారు. వైద్య పరీక్షల్లో తేలిన ఫలితాన్ని బట్టి కోవిడ్‌ కు చికిత్సను అందిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిసినా దోమలను నియంత్రించడంలో జీహెచ్‌ ఎంసీ ఎంటమాలజీ విభాగం విఫలమవుతున్నది. దోమల లార్వా, దోమల విజృంభణలను నివారించడంలో ఎంటమాలజీ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూ.. తూ.. మంత్రంగా ఫాగింగ్‌ చేపట్టి చేతులు దులుపు కుంటున్నారే తప్ప వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. లార్వా నిర్మూలనలో సైతం పై పై చర్యలు తీసుకొని మిన్నకుండి పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.