Begin typing your search above and press return to search.

నంద్యాల.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయనేనా?

By:  Tupaki Desk   |   9 March 2019 4:30 AM GMT
నంద్యాల.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయనేనా?
X
నంద్యాల ఎంపీ సీటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అస్పష్టత తొలగినట్టే అని తెలుస్తోంది. నంద్యాల ఎంపీ సీటు విషయంలో అభ్యర్థి ఎవరు అనేది ఇన్ని రోజులూ ఆ పార్టీలో జరిగిన చర్చ. పార్టీకి పట్టున్న నియోజకవర్గం కావడంతో.. అభ్యర్థిని ఖరారు చేయడంలో జగన్ కూడా కాస్త వేచి చూసే ధోరణిలోనే గడిపారు. చివరకు ఇప్పుడు ఒకరి చేరికతో నంద్యాల ఎంపీ టికెట్ విషయంలో స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది.

తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పారిశ్రామిక వేత్త పోచా బ్రహ్మానందరెడ్డి చేరారు. జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఎంపీ టికెట్ ఆయనకే ఖరారు అయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ఎంపీ సీటు విషయంలో ఇది వరకూ వినిపించిన పేర్లకు తెరపడినట్టే అని.. బ్రహ్మానందరెడ్డికి ఎంపీ టికెట్ ఖరారు అయినట్టే అని సమాచారం.

నంద్యాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈ విషయంలో ఆ పార్టీ తరఫు నుంచి శివానందరెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. సిట్టింగ్ ఎంపీ - ఫిరాయింపు నేత ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశిస్తూ ఉన్నారు. తను కాకపోయినా తన అల్లుడు పోటీ చేస్తాడని.. అవకాశం ఇవ్వాలని చంద్రబాబుకు ఎస్పీవై విన్నవించుకున్నారు. అయితే బాబు మాత్రం అందుకు ససేమేరా అన్నట్టుగా సమాచారం. నంద్యాల ఎంపీ టికెట్ ను కోరిన తనతో అరవై కోట్ల రూపాయల డబ్బును రెడీగా చూపించమని చంద్రబాబు అడిగారని ఎస్పీవై సంచలన ఆరోపణ చేశారు.

స్థూలంగా ఎస్పీవై కి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కదని మాత్రం తేలిపోయింది. ఈ నేపథ్యంలో రేపు ఆయన అనుచవర్గంతో సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమావేశంలోనే తెలుగుదేశం పార్టీని వీడే ప్రకటన చేయబోతున్నట్టుగా సమాచారం.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే… నంద్యాల్లో పోచా బ్రహ్మానందరెడ్డి వర్సెస్ శివానందరెడ్డిల మధ్యన పోరు జరగబోతోందని చెప్పవచ్చు.