Begin typing your search above and press return to search.

అధికార పార్టీలో డిటెక్టివ్‌ ల హ‌వా

By:  Tupaki Desk   |   6 Jan 2016 6:53 AM GMT
అధికార పార్టీలో డిటెక్టివ్‌ ల హ‌వా
X
సాధార‌ణంగా ప్ర‌త్యర్థుల క‌ద‌లిక‌ల‌ను క‌నిపెట్టేందుకు డిటెక్టివ్‌ ల‌ను ఏర్పాటుచేస్తుంటారు. ఇది రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎక్కువ‌గా జ‌రుగుతుంటుంది. నాయ‌కులు ఎవ‌రైనా ఇత‌ర‌ పార్టీల‌తో అంట‌కాగుతున్నారా? త‌మ‌కు పొగ‌బెట్టే నిర్ణ‌యాలు ఎదుటి శిబిరం తీసుకుంటోందా వంటి కూపీ లాగే ప‌నులు సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం అలాంటి వాతావ‌ర‌ణం ఏమీ లేని పరిస్థితుల్లో, పైగా అధికార పార్టీ ఎంపీ సొంత నేత‌ల‌పై నిఘా పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది.

టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరి వ్యాపార లావాదేవీలపై ఇటీవలి కాలంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఒ) - ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) - కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తనపై ఫిర్యాదులు చేస్తున్నవారెవరనే విషయంపై ప్రతిపక్షాలపై కంటే స్వంత పార్టీ నాయకులపైనే మంత్రికి అనుమానం పెరిగిపోయింది. అవినీతి ఆరోపణలపై తన మంత్రి పదవి ఊడితే పార్టీలో ఎవరెవరు రేస్‌ లో ఉంటారు? చంద్రబాబుకు ఎవరు బాగా సన్నిహితంగా ఉంటున్నారు? అని అనుమానించి ఆ నేతల లక్ష్యంగా ప్రైవేటు డిటెక్టివ్‌ లతో విచారణ జరిపిస్తున్నట్లు స‌మాచారం. ఇందుకోసం ఓ ప్రముఖ ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీని రంగంలోకి దించారు. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఆ సంస్థకు ముంబయి - బెంగళూరులో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌ లో కూడా ఓ ఆఫీస్‌ నిర్వహిస్తున్న‌ట్లు స‌మాచారం. సదరు మంత్రిపై మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలకు ఉప్పు అందిస్తున్న వారెవరో పసిగట్టడం - ఆయన వ్యాపారాలు - ఇతర అంశాలపై పనిగట్టుకొని కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్న వారెవరో నిర్ధరించడం డిటెక్టివ్‌ ఏజెన్సీకి ఇచ్చిన ముఖ్యమైన అసైన్‌ మెంట్‌ గా తెలుస్తోంది. తనను రాజకీయంగా - వ్యాపారపరంగా దెబ్బ తీస్తారని భావిస్తున్న ఓ నలుగురు వ్య‌క్తుల‌ను గుర్తించి వారితో పాటు మరికొందరి పైనా నిఘా పెట్టిన‌ట్లు స‌మాచారం. అనుమానితుల వ్యాపారాలపై అనుక్షణం నిఘా వేసి చెక్‌ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే త‌మ పార్టీకే చెందిన కేంద్ర మంత్రి కావ‌డం, పైగా సొంత నేత‌ల‌పైనే నిఘా పెట్ట‌డం ఇపుడు టీడీపీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. తన సహచర నాయకుల కదలికలపై ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీతో నిఘా పెట్టించి రహస్యంగా విచారణ జరిపించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని పార్టీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. తమపై తమ పార్టీ నాయకుడే ప్రైవేటు విచారణ జరిపిస్తుండ‌టాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు వెనకా ముందు ఆడుతున్నారు. నిఘా పెట్టించిన వ్యక్తి బాబుకు అత్యంత సన్నిహితుడని మిన్న‌కుంటున్నార‌ట‌. అయితే ఇలాంటి చ‌ర్య‌లు మాత్రం పార్టీ ప‌రువును తీస్తాయ‌ని స‌ద‌రు నేత‌లు ఘంటాప‌థంగా చెప్తున్నారు.