Begin typing your search above and press return to search.

ఎంపీల‌ను ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగిన ప్ర‌ధాని

By:  Tupaki Desk   |   5 Jan 2018 10:23 AM GMT
ఎంపీల‌ను ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగిన ప్ర‌ధాని
X
కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చేసింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఉన్న స‌మ‌యాన్ని త‌గ్గించేసింది. ఈ ఏడాది చివ‌రి నాటికి ఎన్నిక‌ల ఫీవ‌ర్ వ‌చ్చేసిన‌ట్లే. వ‌చ్చే ఏడాది ఈ నాటికి రాజ‌కీయ వాతావ‌ర‌ణం హాట్ హాట్ గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు. ముంగిట్లోకి వ‌చ్చేస్తున్న లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ప్రధాని మోడీ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారా? అన్న భావ‌న క‌లిగేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

గ‌డిచిన నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఎంపీలు చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి త‌న‌కు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాల‌ని కోరారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో చేప‌ట్టిన మౌలిక స‌దుపాయాలు.. కీల‌క విజ‌యాలు.. సంస్థాగ‌తంగా పార్టీ బ‌లోపేతానికి చేసిన కృషిని ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్ర‌గ‌తిని ఇవ్వ‌టం ద్వారా.. ఎంపీల ప‌ని తీరును మ‌దింపు చేస్తార‌న్న మాట వినిపిస్తోంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు పోటాపోటీగా జ‌ర‌గ‌టంతోపాటు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ప్ర‌భావం చూపించే నేప‌థ్యంలో మ‌రింత జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాల‌న్న ఉద్దేశంతో మోడీ అండ్ కో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే తమ పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల మీద దృష్టి పెట్టిన మోడీ.. షాలు గెలిచే సీట్లు ఎన్ని అన్న అంశంపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు మొద‌లైన‌ట్లు చెబుతున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ఒక నిర్ణ‌యానికి రావ‌టం కోసం ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కోరిన‌ట్లుగా తెలుస్తోంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ తో బీజేపీ ఎంపీల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. త‌మ ఫ్యూచ‌ర్ ను మోడీ షాలు ఎలా డిసైడ్ చేస్తార‌న్న డైల‌మాలో వారున్నారు. తాము చేసిన ప‌నిని మ‌రింత ఎఫెక్టివ్ గా రిపోర్ట్ లో చూపించే క‌స‌ర‌త్తు క‌మ‌లం ఎంపీల్లో మొద‌లైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.