Begin typing your search above and press return to search.

గుజ‌రాత్‌లోనే మోడీ తిష్ఠ‌.. ఓట‌మి భ‌య‌మేనా?

By:  Tupaki Desk   |   20 Nov 2022 2:00 PM IST
గుజ‌రాత్‌లోనే మోడీ తిష్ఠ‌.. ఓట‌మి భ‌య‌మేనా?
X
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ సొంతం రాష్ట్రం, అంత‌కుమించి బీజేపీ ప్రాణ‌ప్ర‌దంగా చూస్తున్న రాష్ట్రం, ఇరు ప‌క్షాల‌కు(మోడీ-బీజేపీ) కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు చేరువ కావ‌డంతో ఇప్పుడు వ్యూహాల‌పై వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఎక్క‌డికి వెళ్లినా కేవ‌లం ఒక‌టి రెండు రోజులు మాత్ర‌మే ఉండే ప్ర‌ధాని మోడీ.. ఇప్పుడు ఏకంగా 15 రోజుల పాటు గుజ‌రాత్‌లోనే తిష్ఠ‌వేసి.. ఎన్నిక‌ల ప్రచారం చేయ‌నున్నారు. దీంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌పై బీజేపీ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంటే.. కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. గుజ‌రాత్‌లో ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని.. అందుకే అన్నేసి రోజులు మోడీ ప్ర‌చారం చేస్తున్నార‌ని అంటున్నాయి.

మ‌రోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ.. ప్రచారాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగా రాబోయే 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 25 ర్యాలీల్లో ప్రధాని మోడీ ప్రచారం సాగించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇప్ప‌టికే గుజరాత్ చేరుకున్న మోడీ ప్ర‌చారం చేప‌ట్టారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత గుజరాత్‌లో మోడీ పర్యటిస్తుండటం ఇది రెండోసారి.

సౌరాష్ట్ర ప్రాంతంలో నాలుగు ర్యాలీల్లో ప్ర‌దాని పాల్గొంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్రలోని నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేదు.ఈ నేప‌థ్యంలో మోడీ వీటిపైనే దృష్టి పెట్టారు. అనంత‌రం రెండు రోజుల గ్యాప్‌లో మ‌రోసారి ప్ర‌దాని గుజ‌రాత్‌కు రానున్నారు. ఇలా మొత్తం డిసెంబ‌రు 5 లోపు.. 15 రోజుల పాటు ఆయ‌న ఇక్క‌డ ప్రచారం చేయ‌నున్నారు. ఇదిలావుంటే, కేంద్ర‌ హోం మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలోని చెరో 15 ర్యాలీల్లో పాల్గోనున్నారు.

గుజరాత్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందిని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఒక్కొక్కరు కనీసం 2, 3 రోజులు ప్రచార కార్యక్రమంలో పాల్గొని, 2 నుంచి 3 వరకూ ర్యాలీల్లో ప్రసంగిస్తారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 సీట్లు గెలుచుకుంది. ఈసారి 140 సీట్లలో గెలుపు లక్ష్యంగా చేసుకుంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 8న కౌటింగ్ జ‌ర‌గ‌నుంది.