Begin typing your search above and press return to search.

మోడీ భ‌విష్య‌త్‌ ను చెప్పేస్తున్న అమెరికన్లు

By:  Tupaki Desk   |   16 March 2017 6:29 AM GMT
మోడీ భ‌విష్య‌త్‌ ను చెప్పేస్తున్న అమెరికన్లు
X
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం నేప‌థ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లోను ప్రధాని నరేంద్ర మోడీ హవానే కొనసాగవచ్చని భారత దేశ వ్యవహారాలపై అమెరికాకు చెందిన ప్రముఖ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సాధారణమైనవి కావనిపిస్తోందని ఒక నిపుణుడు అభిప్రాయ పడగా, 2019 తర్వాత కూడా మోడీ నాయకత్వమే కొనసాగవచ్చని మరో నిపుణుడు అన్నారు.

జార్జి వాషింగ్టన్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ - అంతర్జాతీయ వ్యవహారాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆడ‌మ్ జీగ్‌ ఫెల్డ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీకి భారీ విజయం లభించిందని, అంతకు ముందు గెలుపొందిన బిఎస్‌ పి - సమాజ్‌ వాది పార్టీలతో పోలిస్తే బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారని ఆయన అన్నారు. 'అసెంబ్లీ ఎన్నికలు పెద్ద మార్పును సూచించడం లేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత 2014 సాధారణ ఎన్నికల ఫలితాలు సాధారణమైనవి కావని అనిపిస్తోంది’ అని ఆడ‌మ్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఎన్నికలతో 2019లో సైతం నరేంద్ర మోడీయే విజేతగా నిలుస్తారని చాలా స్పష్టంగా నిరూపితమైందని అమెరికన్ ఎంటర్‌ ప్రైజ్ ఇన్‌ స్టిట్యూట్‌ లో రెసిడెంట్ ఫెలో అయిన సదానంద్ ధుమే అనే మరో నిపుణుడు అభిప్రాయ పడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ తాము కులం, మతానికి అతీతమని చెప్పుకొంటూనే కులం-మతం కార్డును ఉపయోగించిందని ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌ లో ఉండిన ధుమే అన్నారు. నోట్ల రద్దు ప్రజల్లోకి బాగా వెళ్లిందని, ఈ విధానం కారణంగా జనం ఇబ్బంది పడినప్పటికీ అది జనం హృదయాలను గెలుచుకుందని రాష్ట్రంలో అనేక మందితో మాట్లాడటం ద్వారా తెలిసిన‌ట్లు ధుమే చెప్పారు. అయితే ఈ చరిత్రాత్మక విజయం తర్వాత మోడీ ప్రైవేట్ రంగం ఆశించినట్లుగా ఆర్థిక సంస్కరణలను చేపట్టకపోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

2019లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ మోడీకే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంటుందని జార్జిటౌన్ యూనివర్శిటీలో వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌ లో ప్రొఫెసర్‌ గా పని చేస్తున్న ఇర్ఫాన్ నూరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ఢీకొన్నప్పుడు బీజేపీని ఓడించడం సాధ్యమేనని, ప్రతిపక్షాలు విడిపోయి ఉన్నప్పుడు మాత్రం ఆ పార్టీదే పైచేయి అవుతుందని విశ్లేషించారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కూడా మొదలు కావచ్చని కూడా నూరుద్దీన్ అభిప్రాయపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/