Begin typing your search above and press return to search.

మోడీ విలాపం.. ఎవరు చేసుకున్న పాపం.!

By:  Tupaki Desk   |   3 March 2020 10:25 AM IST
మోడీ విలాపం.. ఎవరు చేసుకున్న పాపం.!
X
మోడీ పెంచి పోషించిన పామే (సోషల్ మీడియా) ఆయనను ఇప్పుడు కాటువేస్తోందా? సోషల్ మీడియాతో ఎదిగిన మోడీని ఇప్పుడు అదే మీడియా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సిద్ధాంత రాజకీయంలో విభేదాలు మోడీని కలవరపెడుతున్నాయా? మోడీ సోషల్ మీడియా విలాపం వెనుక కారణమేంటి?

దేశంలో మోడీ గద్దెనెక్కాడంటే ప్రధాన కారణం.. యువత, మధ్యతరగతి వారిలో ఆయనుకున్న క్రేజ్. పైగా సామాన్యుడు. అందుకే వీరిని ఆకట్టుకోవడానికి మోడీ సామాజిక మాధ్యమాలనే ఆయుధంగా వాడాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల ద్వారా ప్రజలకు చేరువయ్యాడు. తన అనుంగ శ్రేయోభిలాషి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతను ‘జియో’ను స్థాపింపచేసి దేశ ప్రజలకు డేటా అందుబాటులోకి తీసుకొచ్చి డిజిటల్ ప్రపంచాన్ని మోడీ ఆవిష్కరింప చేశారనే ప్రచారం ఉంది.

దేశంలో మోడీ రాకముందు అసలు ఇలా డిజిటల్ ప్రచారం.. సామాజిక మాధ్యమాల ద్వారా పాపులర్ అయిన రాజకీయ నేత మరొకరు లేరు. మోడీకి బలం ఈ సోషల్ మీడియానే. అయితే ఇప్పుడు అదే బలహీనత అయ్యి కూర్చుంది. స్వయం కృతాపరాధమే మోడీని ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఎగ్జిట్ అయ్యేలా పురిగొల్పుతోందన్న చర్చ సాగుతోంది. ఇంతకీ మోడీ విలాపానికి కారణమేంటి? ఎందుకు ఆయన సోషల్ మీడియా ఫ్టాట్ ఫామ్ నుంచి వైదొలుగుతున్నారు?

ఒక టీ వాలాను దేశానికి ప్రధానిని చేశారు. దాన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆశలు, ఆకాంక్షలు, పేదరిక నిర్మూలన మౌళిక సదుపాయాలు కల్పిస్తే చరిత్రలో మోడీ చిరస్థాయిగా మిగిలిపోయేవారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నట్టు ‘ఈ కుల మతాల లొల్లి కూడుపెడుతాయా?’ అన్నది ఇక్కడ గమనించాలి. మోడీ హిందుత్వ రాజకీయం ఇప్పుడు ఆయనకు చేటు తెస్తోంది. సీఏఏ, ఎన్నార్సీల తేనెతుట్టను కదిపి ఇప్పుడు ఢిల్లీ అల్లర్లు మరణాలకు మోడీ పరోక్ష కారణమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవే ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయి.

సోషల్ మీడియాను ఆయుధంగా మలిచిన మోడీకి ఇప్పుడు అల్లర్ల వెనుక ఇదే సోషల్ మీడియా కీరోల్ పోషించడం.. మోడీని సైతం సామాజిక మాధ్యమాల్లో టార్గెట్ చేస్తుండడంతో మోడీ సామాజిక నిర్వేదం వ్యక్తం చేశారు. తాను ఫేస్ బుక్ , ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వీడే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఈ వ్యవహారం నడిచింది. దీనికి రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు. ‘వీడాల్సింది సోషల్ మీడియా కాదు.. విద్వేశం అని’ కౌంటర్ ఇచ్చారు. ఇలా మోడీ ఆయుధమే నేడు ఆయనకు పోటు పొడిచేలా తయారైంది.