Begin typing your search above and press return to search.

కరోనా విజృంభణపై పీఎం మోదీ సమీక్ష.. కారణాలు అవేనంటున్న అధికారులు!

By:  Tupaki Desk   |   5 April 2021 3:18 AM GMT
కరోనా విజృంభణపై పీఎం మోదీ సమీక్ష.. కారణాలు అవేనంటున్న అధికారులు!
X
దేశంలో కరోనా మరోసారి పంజా విసిరింది. ప్రస్తుతం మహమ్మారి రెండో దశ గుప్పిట్లో ఉన్నామని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు. కాగా కేసులు తగ్గినట్లే తగ్గి గత నెల నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. ఏడాది దాటినా కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో పీఎం మోదీ సమీక్షించారు.

గతేడాది కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని.. భయంతో బయటకు వెళ్లకుండా ఉన్నారని అధికారులు ఈ సమావేశంలో గుర్తు చేశారు. ఏడాది నుంచి వైరస్పై ప్రజల పోరు కొనసాగుతుండడం వల్ల వారిలో ఒకింత అలసత్వం నెలకొందని ఆదివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మోదీకి అధికారులు వివరించారు. ప్రజల్లో అలసట పెరగడం కేసులు అధికమవడానికి ఒక కారణం అయి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.

కొవిడ్ కేసులు నమోదు కావడం మొదలై ఏడాది దాటిందని అధికారులు చెప్పారు. కాగా ప్రజలు అప్పటి నుంచి కరోనా నిబంధనలు పాటించారని.. ప్రస్తుతం ఆ నిబంధనలు పాటించడం మానేశారని తెలిపారు. కరోనా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదనుకొని చాలామంది నిబంధనలు బేఖాతరు చేస్తున్నారని అధికారులు మోదీకి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరైన అవగాహన లేకపోవడం ఇందుకు కారణమేనని అన్నారు.

దేశంలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదని అధికారులు పీఎంకు గుర్తు చేశారు. వైరస్ను ఎదుర్కోవడానికి ఇంకా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కరోనా విజృంభించడానికి ముఖ్య కారణాలు ఇవేనని అధికారులు మోదీకి వివరించారు. కాగా దీనిపై ఆయన వెంటనే స్పందించారు. కరోనా కట్టడికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌ఘడ్లకు కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ఈ నెల 6నుంచి 14 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని... అలాగే వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఈ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. అందుకు సంబంధించిన కీలక సూచనలను అధికారులకు పీఎం మోదీ వివరించారు.