Begin typing your search above and press return to search.

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ భేష్ః ప్ర‌ధాని

By:  Tupaki Desk   |   28 May 2021 6:40 AM GMT
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ భేష్ః ప్ర‌ధాని
X
పచ్చదనం ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొద‌లు పెట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం అభినందనీయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించిన‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రధానమంత్రి ఓ లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది.

భూమాతను, ప్రకృతిని పూజించడ మన సంస్కృతిలో భాగమని, ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపేందుకు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కృషి చేస్తోందని లేఖలో పేర్కొన్నారట. మనమందరమూ భూమాత పిల్లలమే అని, ప్రకృతితో సహజీవనం, సమన్వయం చేసుకోవడమే జీవనమార్గం కావాలని ప్రధాని ఆకాంక్షించినట్టు సమాచారం.

ఈ సందర్భంగా.. మన ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని కూడా ప్రధాని పేర్కొన్నట్టు సమాచారం. సౌరశక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం, కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం వంటి చర్యలన్నీ పర్యావరణ రక్షణకు తోడ్పాటును ఇస్తాయని పేర్కొన్నారట.

ఇక, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ విశిష్టతను తెలుపుతూ ఎం.పీ సంతోష్ కుమార్ వెలువరించిన ‘వృక్షవేదం’ పుస్తకం గురించి తన లేఖలో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం. ప్రతి ఒక్కరూ వృక్షవేదం పుస్తకాన్ని చదివి, ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకోవాలని మోడీ అభిలాషించినట్టు సమాచారం. ప్రతిఒక్కరూ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొనడం ద్వారా పచ్చదనాన్ని దేశవ్యాప్తంగా పెంచాలని ప్రధాని ఆకాంక్షించినట్టు సమాచారం.

దీంతో.. ప్ర‌ధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన ఎం.పీ సంతోష్ కుమార్.. ఈ ప్రోత్సాహంతో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను మరింత ముందకు తీసుకువెళ్తామని చెప్పినట్టు సమాచారం.