Begin typing your search above and press return to search.

రూ.వంద లక్షల కోట్లతో కొత్త పథకమా.. ఇలాంటివి నీకే సాధ్యం మోడీజీ?

By:  Tupaki Desk   |   14 Oct 2021 3:31 AM GMT
రూ.వంద లక్షల కోట్లతో కొత్త పథకమా.. ఇలాంటివి నీకే సాధ్యం మోడీజీ?
X
విన్నంతనే ఉలిక్కిపడేలాంటి భారీ అంకెలతో హడావుడి చేయటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాతే ఎవరైనా. ఆడంబరంగా మళ్లీ నోట మాట రాని రీతిలో ఆయన ప్రభుత్వం చేసే ప్రకటనలు చూసినంతనే వావ్ అనేలా చేయటం.. ఆ తర్వాతి కాలంలో వామ్మో అనుకునేలా చేయటంలో ఆయనకు మించినోళ్లు మరెవరూ ఉండరనే చెప్పాలి. సాధ్యాసాధ్యాల్ని పక్కన పెడితే.. ఇంతటి భారీ గణాంకాలతో మాటలు చెప్పే ధైర్యం అందరికి ఉండదు కదా. ఎంత అధికారంలో ఉన్నప్పటికీ.. అర్థం కాని లెక్కల్ని మాటల్లో చెప్పటం.. చేతల్లో మాత్రం నేతి బీరలో నేతిగా ఉండటం అంత ఈజీ కాదు. తాజాగా మరో భారీ పథకాన్ని మోడీ మాష్టారు జాతి ప్రజల ప్రయోజనాల కోసం ఆవిష్కరించారు.

దాని పేరు ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’. దీని అమలుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల రూ.100 లక్షల కోట్లు. ఎందుకైనా మంచిది. ఈ అంచనా లెక్కను మరోసారి చదువుకోవటం మంచిది. భారత దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఉమ్మడి మార్గంలోకి తేవడమే లక్ష్యంగా మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం ఈ పథకాన్ని రూపొందించారు. దేశ మౌలిక సదుపాయాలకు ఈ పథకం చారిత్రకమైనదని మోడీ సర్కారు మాట.

పదహారు కేంద్ర మంత్రిత్వ శాఖలు.. వాటికి సంబంధించిన ప్రస్తుత ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాల కార్యకలాపాల కోసం ఒక పోర్టల్ ను ఏర్పాటు చేస్తారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల్ని క్రియేట్ చేయటం.. లాజిస్టిక్స్ వ్యయాల తగ్గుదల.. సప్లయ్ చైన్స్ మెరుగుదల.. అంతర్జాతీయ పోటీకి స్థానిక వస్తువులు నిలవటం లాంటివి గతిశక్తి వల్ల సాధ్యమవుతాయని చెబుతోంది. ఇలాంటి మాటల్ని విన్నప్పుడు అర్థమయ్యే కంటే అర్థమై కానట్లుగా ఉండటమే ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా అలాంటి అనుభవమే మోడీ మాస్టారి మాటల్ని విన్నప్పుడు కలుగుతుంది.

అంతదాకా ఎందుకు కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశీయంగా పారిశామ్రిక వర్గాలకు ఊరట కలిగించేలా కొన్ని లక్షల కోట్ల రూపాయిలతో ఒక రిలీఫ్ ప్యాకేజీ మీద భారీ ప్రకటనల్ని ఇవ్వటం.. తల పండిన ఆర్థికవేత్తలకు సైతం ఆ లెక్కలేందో? మోడీ వరాల మర్మమేందో అర్థమైతే గొప్పే. ఇలా అప్పుడప్పుడు బడాయిగా ఆయన ప్రకటించే ప్రకటనలు కోట్లాది మంది ప్రజలకు ఒక పట్టాన అర్థమై చావదన్నది నిజం.

అంత పెద్ద మోడీ మాస్టారి నోటి నుంచి అద్భుతమైన పథకం గురించి వచ్చినప్పుడు.. చాలా చిట్టి బుర్రలకు అర్థం కాని కొన్ని ప్రశ్నలు వచ్చేస్తుంటాయి. దేశ భవిత కోసం వారాంత సెలవులు తీసుకోకుండా పని చేసే ప్రధాని మోడీ లాంటి వారి భారీ విజన్.. ఎంత మాత్రం అర్థం కావు. అలాంటి వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని చూస్తే..

- మోడీ మాస్టారి టర్మ్ ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఐదేళ్ల పదవీ కాలంలో చివరి ఆర్నెల్లును పక్కన పెడితే.. మిగిలింది గట్టిగా రెండేళ్లు మాత్రమే. ఈ స్వల్ప వ్యవధికి రూ.100 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?

- ఒకవేళ.. వచ్చే రెండేళ్లు ఏంది? ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం మాదే అన్న ధీమా మోడీషాలకు ఉందనే అనుకుందాం. అలా చూసినా.. ఏడేళ్లు.. లేదంటే ఆరున్నరేళ్లు. ఈ కాలంలోనూ రూ.100 లక్షల కోట్లను ఏడేళ్లకు రూ.100 లక్షల కోట్లను సమంగా విభజించి చూడండి.. ఏడాదికి ఎన్ని వేల కోట్లు అవుతుంది?

- దేశ వార్షిక బడ్జెట్ ఎంత? అదిరూ.100 లక్షల కోట్లకు సమానం అయ్యేందుకు ఎన్నేళ్ల బడ్జెట్ అవుతుందో చూడండి. అప్పుడు విషయమంతా ఇట్టే అర్థమైపోతుంది. ఏతా వాతా చెప్పొచ్చేదేమంటే.. అంకెల్లో కనిపించే గంభీరత్వం.. వాస్తవంలో ఏ మేరకు అన్న సందేహాం అందరికి అర్థమయ్యేలా చెబితే బాగుంటుందని. ఆ చిన్న పని చేయి సామి.. నీకు రుణపడి ఉంటాం.