Begin typing your search above and press return to search.

కలువలతో కమలాగ్రజుడి తులాభారం

By:  Tupaki Desk   |   8 Jun 2019 5:09 PM IST
కలువలతో కమలాగ్రజుడి తులాభారం
X
ప్రధాని మోదీ ఏం చేసినా ప్రత్యేకమే. ఆయన చేసే ప్రతి పనీ సోషల్ మీడియాలో వైరలే. ఈ రోజు కేరళ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ గురువాయూర్‌ లోని శ్రీకష్ణ ఆలయంలో తులాభారం వేసుకున్నారు. ఇప్పుడా చిత్రాలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి.

శుక్రవారం రాత్రి కోచికి చేరుకున్న మోదీ.. శనివారం ఉదయం అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో త్రిశూర్‌ చేరుకున్నారు. గురువాయూర్‌ చేరుకున్న ప్రధాని అక్కడ ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. మోదీకి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో మోదీ తులాభార కార్యక్రమం జరిగింది. మొత్తం 100 కిలోల కలువలతో మోదీకి తులాభారం వేశారు. తన బరువుకు తూగే కలువలను స్వామివారికి ప్రధాని మోదీ సమర్పించారు.

గురవాయూర్ ఆలయంలో తులాభారంలో పుష్పాలు - పండ్లు - ధాన్యాలు వంటివి సమర్పిస్తారు. వీటికి సమానమైన విలువతో డబ్బులను ఆలయానికి అందజేస్తారు. ఆలయంలో ప్రధాని మోదీ 20 నిమిషాలు పాటు గడిపారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లోనే ఆలయంలోకి మోదీ ప్రవేశించారు. ప్రధాని వెంట కేరళ గవర్నర్ సదాశివన్ - కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ - కేరళ దేవాదాయ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఉన్నారు.

శ్రీకృష్ణాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన అభినందన సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ పాల్గొన్న తొలి పబ్లిక్ మీటింగ్ ఇదే. తర్వాత కేరళ నుంచి మాల్దీవులు - శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే. మాల్దీవులు పర్యటనలో భాగంగా అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహిం సొహిల్‌ తో భేటీ అయి కొన్ని ఒప్పందాలు చేసుకోనున్నారు.