Begin typing your search above and press return to search.

పంజాబ్‌లో మోడీకి మ‌ళ్లీ అదే సీన్ రిపీట్‌.. ఏం జ‌రిగిందంటే

By:  Tupaki Desk   |   14 Feb 2022 10:00 PM IST
పంజాబ్‌లో మోడీకి మ‌ళ్లీ అదే సీన్ రిపీట్‌.. ఏం జ‌రిగిందంటే
X
కొన్ని రోజుల కింద‌ట పంజాబ్‌లో ప‌ర్యటించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి.. ఘోర అవ‌మానం జ‌రిగిన విష‌యం ఇంకా కళ్ల ముందు నుంచి క‌రిగిపోక‌ముందే.. మ‌రోసారి అదే స్థాయిలో అవ‌మానం జ‌రిగింది. పంజాబ్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇక్క‌డ ప‌ర్య‌టించారు. అయితే.. ఈ సారి స్థానిక అధికారులు ఆయ‌న‌కు స‌హ‌క‌రించలేదు. ప్ర‌ధాని వ‌స్తున్న కార్య‌క్ర‌మాల‌కు వారు ఏర్పాట్లు చేయ‌లేదు.

దీంతో ప్ర‌ధాని షెడ్యూల్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. ఓ మందిరాన్ని దర్శించుకోలేకపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బహిరంగ సభలో వెల్లడించారు.

గత నెలలో ఫిరోజ్పుర్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర దుమారం రేపగా.. తాజాగా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రార్థనాస్థలాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. పంజాబ్ పర్యటనకు వచ్చిన మోడీ.. జలంధర్లోని దేవీ తలాబ్ మందిరాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు.

అయితే అధికారులు ప్ర‌ధానికోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, ఫలితంగా మందిరాన్ని దర్శించుకోలేకపోయారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పరిస్థితి ఈ రకంగా ఉందని ధ్వజమెత్తారు. జలంధర్కు మరోసారి వస్తానని, దేవిని తప్పక దర్శించుకుంటానని బహిరంగ సభలో స్పష్టం చేశారు.

``దేవి తలాబ్ మందిరాన్ని దర్శించుకోవాలనేది నా కోరిక. కానీ, ఇక్కడి పోలీసులు, యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయలేమని చెప్పాయి. హెలికాప్టర్లో వెళ్లిపోవాలని సూచించాయి.

ఇలా ఉంది ఇక్కడి ప్రభుత్వ పరిస్థితి. కానీ, నేను మళ్లీ వచ్చి మందిరాన్ని దర్శించుకుంటాను`` అని మోడీ వ్యాఖ్యానించారు. అంతకుముందు, జనవరి 5న మోదీ పంజాబ్లో పర్యటించారు. ఫిరోజ్పుర్లో నిరసనకారులు అడ్డగించడం వల్ల కాన్వాయ్లో చిక్కుకుపోయిన మోడీ.. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండానే డిల్లీకి తిరుగుపయనమయ్యారు.

ఇదిలావుంటే, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని తాజా గా మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత పంజాబ్లో అభివృద్ధి నూతన శకం మొదలవుతుందని చెప్పారు. నవభారత్ ప్రతిజ్ఞతో దేశం ముందుకెళ్తోందని, నవ బంజాబ్ సాకారమైనప్పుడే దేశ ప్రజల ప్రతిజ్ఞ నెరవేరుతుందని అన్నారు.

నూతన పంజాబ్లో ప్రతి దళితుడికీ గౌరవం లభిస్తుందని, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని వివరించారు. అవినీతికి ఆస్కారం లేదని అన్నారు.

ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఉందని, అలాంటి వారు రాష్ట్రానికేం చేస్తారని అన్నారు. పంజాబ్కు వచ్చి కొందరు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పంజాబ్ను మాదకద్రవ్యాలు లేని రాష్ట్రంగా మార్చుతామని చెబుతున్న వారు.. సొంత రాష్ట్రంలో మాత్రం భారీగా మద్యం దుకాణాలను తెరుస్తున్నారని ఆక్షేపించారు.