Begin typing your search above and press return to search.

రాక రాక వస్తున్న మోడీ...రాజధాని ఊసు ఉంటుందా...?

By:  Tupaki Desk   |   25 Oct 2022 10:16 PM IST
రాక రాక వస్తున్న మోడీ...రాజధాని ఊసు ఉంటుందా...?
X
ఆయన దేశానికి ప్రధాని. ఆయన బిజీ బిజీగా దేశ విదేశాలలో పర్యటనలు చేస్తూ ఉంటారు. ఆయన ఏపీకి రావడమే బహు తక్కువ. మూడు నెలల క్రితం భీమవరం ప్రధాని మోడీ వచ్చారు. అల్లూరి 125వ జయంతి వేడుకలలో నాడు పాలుపంచుకున్నారు. వచ్చే నెలలో అంటే నవంబర్ లో విశాఖకు మోడీ వస్తున్నట్లుగా తెలుస్తోంది. మోడీ విశాఖ పర్యటనకు వచ్చి దాదాపుగా నాలుగేళ్లు అవుతోంది.

ఆయన 2019 మార్చిలో విశాఖ వచ్చారు. నాడు విశాఖ రైల్వే జోన్ ప్రకటనను విశాఖలోనే చేశారు. ఆ తరువాత ఎన్నికలు వచ్చి రెండవసారి ప్రధాని అయ్యారు. అయితే ఈ దఫా మాత్రం విశాఖకు ఆయన వచ్చింది లేదు. మోడీ విశాఖ వస్తారని గతంలో ప్రచారం జరిగినా ఎందుకో అది వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి టూర్ కన్ ఫర్మ్ అంటున్నారు.

ఈ మధ్యనే బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మోడీ చేతుల మీదుగా విశాఖలో రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపన చేయిస్తామని చెప్పుకొచ్చారు. అదే మాటను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా చెప్పారు. ఇదిలా ఉంటే మోడీని విశాఖకు తీసుకువచ్చి ఆయన చేత భోగాపురంలో నిర్మాణం కాబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది అని అంటున్నారు.

అలాగే విభజన హామీల మేరకు విజయనగరం జిల్లాకు మంజూరు అయిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సొంత భవనాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ప్రధాని చేత జరిపించాలని అనుకుంటున్నారు. దీంతో మూడు పెద్ద కార్యక్రమాలే పెట్టుకుని ప్రధాని మోడీ నవంబర్ లో విశాఖ టూర్ చేపడతారు అని అంటున్నారు.

ఇదిలా ఉండగా ప్రధాని విశాఖ వచ్చే సందర్భం ఈసారి కాస్తా భిన్నమైన రాజకీయ వాతావరణంలో ఉండే అవకాశం ఉంది. ప్రధాని పాల్గొనే కార్యక్రమాలలో ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొంటారు. విశాఖ రాజధాని కావాలని డిమాండ్ ని పెంచుతూ మంత్రులు హీట్ తీసుకుని వస్తున్నారు. విశాఖ గర్జన ఈ మధ్యనే జరిగింది.

ఇక ప్రధాని శంకుస్థాపనల తరువాత సభలో ప్రసంగించాల్సి ఉంటుంది. ఆయన విశాఖ వైభవం గురించి అభివృద్ధి గురించి మామూలుగానే చెబుతారు. మరి అదే సమయంలో విశాఖ రాజదాని ఊసు ఏమైనా ప్రధాని నోటి వెంట వస్తుందా అసలు మూడు రాజధానుల మీద ఆయన అభిప్రాయం ఏమైనా చూచాయగా వెలువరిస్తారా. అమరావతి రాజధానికి ఆయన కట్టుబడి ఉంటారా. మొత్తానికి విశాఖ కేంద్రంగా రాజకీయం రాజధాని రచ్చ నడుస్తున్న వేళ మోడీ ఈ సిటీలో అడుగుపెట్టడమే ఒక ప్రాధాన్యతతో కూడిన పరిణామం అని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి ప్రధాని టూర్ ఎలా సాగుతుందో. ఆయన ఏ విషయాలు చెబుతారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.