Begin typing your search above and press return to search.

'పీఎం కేర్స్ ఫండ్' కు విరాళాలివ్వండి...మోడీ పిలుపు

By:  Tupaki Desk   |   28 March 2020 3:31 PM GMT
పీఎం కేర్స్ ఫండ్ కు విరాళాలివ్వండి...మోడీ పిలుపు
X
కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. హఠాత్తుగా విధించిన లాక్ డౌన్ వల్ల దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పేద, అల్ప ఆదాయ వర్గాలకు ఊరటనిచ్చి ఆదుకునేందుకు కేంద్రం 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ప్రజలందరినీ ఈ కష్ట కాలంలో ఆదుకుంటామని కేంద్రం తెలిపింది. ఇక, కరోనా మహమ్మారి నేపథ్యంలో అవసరమైన ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రీడాకారులు ముందుకు వస్తున్నారు. ప్రధాన మంత్రి సహాయనిధికి తమకు తోచిన విరాళాలిస్తూ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరు కోసం, సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రధాని మోడీ 'పీఎం కేర్స్ ఫండ్'పేరుతో సహాయ నిధిని ఏర్పాటు చేశారు. విరాళాలు ఇవ్వదలచిన వారు 'పీఎం కేర్స్ ఫండ్' కు విరాళాలు ఇవ్వాలని మోడీ పిలుపునిచ్చారు.

కరోనాను దీటుగా ఎదుర్కొనేందుకు పారిశుధ్యం ఎంతో అవసరం. ఈ క్రమంలోనే పారిశుధ్యంతోపాటు పలు సహాయక చర్యలకు ఉపయోగపడేలా విరాళాలు కూడా విరివిగా ఇవ్వవలసిన అవసరం ఉంది. అందుకే, ప్రధాని మోడీ `పీఎం కేర్స్ ఫండ్ 'పేరుతో విరాళాలిచ్చేవారికి ఓ వేదికను ఏర్పాటు చేశారు. భారీ మొత్తాలే కాకుండా చిన్నమొత్తాలు కూడా విరాళాలుగా అందించవచ్చని మోడీ తెలిపారు. కరోనా తరహాలో భవిష్యత్తులో ఏవైనా విపత్తులు వస్తే...ఈ నిధి ద్వారా సాయం చేస్తామని మోడీ చెప్పారు. విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు, కరోనా వంటి మహమ్మారుల బారి నుండి ప్రజలను కాపాడే పరిశోధనలకు ఈ నిధి ఊతమిస్తుందని మోడీ పేర్కొన్నారు. 'పీఎం కేర్స్ ఫండ్' బ్యాంకు అకౌంట్ వివరాలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ(గూగుల్ పే, ఫోన్ పే వంటివి) తదితర అన్ని ఆన్ లైన్ పేమెంట్ విధానాల ద్వారా విరాళాలివ్వవచ్చు.