Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : శబరిమలకు రావొద్దు అంటూ ట్రావెన్‌ కోర్‌ బోర్డు ప్రకటన

By:  Tupaki Desk   |   11 March 2020 5:29 AM GMT
కరోనా ఎఫెక్ట్ : శబరిమలకు రావొద్దు అంటూ ట్రావెన్‌ కోర్‌ బోర్డు ప్రకటన
X
ప్రపంచ ప్రసిద్దిగాంచిన కేరళలోని సుప్రసిద్ధ ఆలయం అయిన శబరిమల పుణ్యక్షేత్రంపై కరోనా ప్రభావం పడింది. కేరళలో ఇప్పటికే కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండటంతో .. భక్తులు అయ్యప్ప దర్శనానికి రావొద్దని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. నెలవారీ పూజల కోసం శుక్రవారం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. పూజల అనంతరం తిరిగి మళ్లీ మార్చి 18న మూసివేస్తారు. ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో శబరిమల దర్శనానికి రావొద్దని భక్తులకు సూచించారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఎవరైనా ఈ ప్రకటన గురించి తెలియక , ఆ అయ్యప్ప దర్శనం కోసం వస్తే , వారిని అడ్డుకోమని , అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చు అని తెలిపారు.రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.అలాగే ఎక్కువ మంది గుమిగూడటానికి ఆస్కారమిచ్చే ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించవద్దని ఆయన కోరారు. కేరళలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న పతనంతిట్ట జిల్లాలోనే శబరిమల ఆలయం ఉంది. రాష్ట్రంలో నమోదైన 12 కేసుల్లో 7 కేసులు ఈ జిల్లాలోనే నమోదవడం గమనార్హం.

ఇకపోతే, రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 14కు చేరింది. కరోనా వ్యాప్తి నేపథ్యం లో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, థియేటర్ల ను ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు, కర్ణాటక, పుణేలో ముగ్గురికి చొప్పున వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 61కి పెరిగింది. బెంగళూరులో ప్రాథమిక పాఠశాలలకు నిరవధిక సెలవులు ప్రకటించారు.

కాగా , ఈ కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 4,091 మంది మృతి చెందారు. 1,16,711 మంది ఈ వైరస్ బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్క చైనాలోనే ఇప్పటి వరకు 3,136 మంది చనిపోయారు. భారత్‌లో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ఆ వైరస్ ని నియంత్రించేందుకు ఈశాన్య రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నాయి. మిజోరం సోమవారమే మయన్మార్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసివేయగా, తాజాగా మణిపూర్‌ కూడా మయన్మార్‌ తో సరిహద్దులను మూసివేసింది. ఇటీవలే సిక్కిం, అరుణాచల్‌ కూడా విదేశీయుల పర్యటనలపై ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.