Begin typing your search above and press return to search.

మసీదుల్లోకి మహిళలను రానివ్వండి - సుప్రీంకోర్టులో పిటిషను

By:  Tupaki Desk   |   17 April 2019 12:21 PM GMT
మసీదుల్లోకి మహిళలను రానివ్వండి  - సుప్రీంకోర్టులో పిటిషను
X
శబరిమల తీర్పు వచ్చినప్పటి నుంచి దేశంలో అనేక మంది లేవనెత్తిన ప్రశ్న... దేవుడి గుళ్లతో కోర్టులకు పనేంటి? అని. అయితే, రాజ్యాంగం ప్రతి పౌరుడికి కేవలం భౌతిక పరమైన భద్రత, హక్కు మాత్రమే ఇవ్వలేదు. ఇతరులకు ఇబ్బంది కానంతవరకు మానసికంగా కూడా కోరుకున్నది నెరవేర్చుకునే హక్కును ఇచ్చింది. అందుకే సంప్రదాయమే అయినా శబరిమల ప్రవేశానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, తాజాగా అలాంటి పిటిషను మరోటి సుప్రీంకోర్టు గడప తొక్కింది. అయితే, ఇది ముస్లిం మత ప్రార్థన స్థలాలకు సంబంధించినది. ఎన్నికల సమయంలో పుణెకు చెందిన యాస్మీజ్‌ జుబేర్‌ అహ్మద్‌ పీర్జాదే, జుబేర్‌ అహ్మద్‌ పీర్జాదే అనే జంట మసీదుల్లో మహిళలకు ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఉందా? లేకపోతే అనుమతి ఇస్తారా అంటూ సుప్రీంకోర్టులో పిటిషను వేశారు.

పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్రానికి, న్యాయ శాఖకు, మైనారిటీ శాఖకు, మైనారిటీ కమిషన్‌కు, మహారాష్ట్ర వక్ఫ్‌ బోర్డుకు, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డుకూ వివరణ కోరుతూ నోటీసులు పంపింది. ఈ పిటిషను స్వీకరించే ముందు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎస్ఏ బోబ్డే, ఎస్ఏ నజీర్లతో ఏర్పాటైన బెంచ్ శబరిమల తీర్పును ఉంటకించడం విశేషం. శబరిమల తీర్పును దృష్టిలో ఉంచుకునే దీనికి అంగీకరించినట్లు చెప్పారు.

శబరిమల కేసుకు దీనికి ఒక తేడా ఉంది. శబరిమల విషయంలో కేసు వేసిన వారు ఆ గుడికి వెళ్లి అనుమతి నిరాకరించబడిన వారు కాదు. కానీ ఈ పిటిషను వేసిన వారు మాత్రం పుణెలోని బోపిడి ప్రాంతంలో ఉన్న మొహమ్మదీయ జామా మసీదులో అనుమతి నిరాకరింపబడిన వారే. ఆ మసీుదలో మహిళలు నమాజ్‌ చేయడానికి అనుమతి కోరితే... పర్యవేక్షకులు గాని, అక్కడి ఇమామ్‌ గాని దీనికి ఒప్పుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.

వారి వాదన ఏంటంటే... రాజ్యాంగపరంగా పబ్లిక్ ప్లేసులోకి జెండర్ పరంగా అనుమతి నిరాకరణ స్వేచ్ఛను అడ్డుకోవడం అంటున్నారు. అంతేకాదు. ఖురాన్ లో లేని నిబంధన మసీదుల్లో ఎందుకు అమలు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. పిటిషన్‌ను అనుమతించే ముందు-పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశుతోశ్‌ దూబేకి ధర్మాసనం ఆసక్తికరమైన ప్రశ్నలు వేసింది. అనుమతి నిరాకరణ అనేది మీ క్లయింటు స్వయంగా ఎదుర్కొన్నదా ? లేదా? అని ప్రశ్నించింది. అయితే, వారు దానికి అవునని చెప్పారు. వాస్తవానికి మక్కాలోనే మహిళలను అనుమతిస్తున్నపుడు ఇక్కడ ఎందుకు అనుమతించరు అని వారు అనుమానం వ్యక్తంచేశారు. అయితే, ఇక్కడే ఇంకో అంశం గమనించాలి... శబరిమల తీర్పు అనంతరం సుప్రీంకోర్టు బెంచ్ కాస్త జాగ్రత్త పడినట్టుంది. ఎందుకంటే శబరిమల పిటిషను వేసిన వారు అక్కడ ప్రవేశం కోరిన వారు కాకపోవడం దీనిపై దేశమంతటా విమర్శలు రావడంతో ఈసారి పిటిషను స్వీకరించే ముందే బెంచ్ ఆ ప్రశ్న వేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా... సుప్రీంకోర్టు నోటీసులపై ముస్లిం లాబోర్డు సభ్యులు ఒకరు స్పందించారు. మసీదుల్లోకి మహిళల ప్రవేశాన్ని గానీ, ప్రార్థనలు చేసుకోడానికి గానీ ఇస్లాం అనుమతించదన్నది సరైనది కాదని. పురుషులతో సమానంగా మహిళలూ మసీదుల్లోకి వెళ్లవచ్చు, ప్రార్థనలూ చేయవచ్చు. కాకపోతే ఇద్దరు వేర్వేరు వరుసల్లో ప్రార్థన చేసుకోవాలన్న నిబంధన మాత్రమే ఉందన్నారు. ఏదేమైనా... ముస్లింల నుంచి ఇలాంటి పిటిషను ఒకటి కోర్టుకు రావడం మార్పుకు చిహ్నంగా చెప్పొచ్చు.