Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారా ?

By:  Tupaki Desk   |   22 Aug 2022 5:30 AM GMT
కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారా ?
X
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యే ప్రకటించటం ఏమిటో అర్థం కావటం లేదు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయటానికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. టీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరినట్లుంది అమిత్ చెప్పింది.

కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారన్న విషయాన్ని కూడా అమిత్ మరచిపోయినట్లున్నారు. అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహిరంగ సభలో హెచ్చరించటమే విచిత్రంగా ఉంది.

నాన్ బీజేపీ ప్రభుత్వాలను ఏదో పద్దతిలో కూల్చేయటమే నరేంద్ర మోడీ, అమిత్ షా టార్గెట్ గా పెట్టుకున్నారు. ముందు కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. రెండు పార్టీల్లోని ఎంఎల్ఏలను లాగేసుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

తర్వాత మధ్యప్రదేశ్ లో ఎంఎల్ఏలను లాగేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. తాజాగా మహారాష్ట్రలో శివసేనలోని 40 మంది ఎంఎల్ఏలను చీల్చి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేశారు. మధ్యలో రాజస్ధాన్లోని కాంగ్రెస్ ఎంఎల్ఏలను లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే ఎందుకనో సక్సెస్ కావటం లేదు. మధ్యలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్లాన్ చేసి ఫెయిలయ్యారు.

ఇపుడు అమిత్ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదో పద్దతిలో కూల్చేసే ఆలోచనలో ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఎంత వీలుంటే అంతమంది టీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాగేసుకునే ప్లాన్ లో బీజేపీ ఉంది.

మరెంతమంది ఎంఎల్ఏలను లాగేసుకోబోతున్నారు ? ఎంతకాలంలో లాగేసుకోవాలని డెడ్ లైన్ పెట్టుకున్నారో అర్ధం కావటం లేదు. ఏదేమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని స్వయంగా అమిత్ షా నే చెప్పారంటే ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఎంత గౌరవం ఉందో అర్ధమైపోతోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.