Begin typing your search above and press return to search.

తిరుమల మీదుగా విమానం.. శ్రీవారి ఆలయం మీదుగా మాత్రం వెళ్లలేదట

By:  Tupaki Desk   |   21 Sept 2020 9:45 AM IST
తిరుమల మీదుగా విమానం.. శ్రీవారి ఆలయం మీదుగా మాత్రం వెళ్లలేదట
X
ఇటీవల కాలంలో తరచూ తిరుమల కొండ వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక అంశం తిరుమలను.. టీటీడీ గురించిన చర్చ ప్రజల్లో జరుగుతోంది. అన్య మతస్తుల దర్శనాలకు డిక్లరేషన్ అక్కర్లేదన్నట్లుగా టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారటం.. తాను అన్న మాట ఒకటైతే.. మరొకటి ప్రచారంలోకి రావటాన్ని ఆయన తప్పు పట్టటం తెలిసిందే. ఈ రగడ ఇలా సాగుతుంటే.. మరోవైపు తిరుమల మీదుగా విమానం వెళ్లిందన్న వాదన మొదలైంది.

నిబంధనల ప్రకారం తిరుమల మీదుగా విమాన రాకపోకలు జరగవు. అందుకు భిన్నంగా తిరుమల కొండ మీదుగా విమానం వెళ్లిందన్న విమర్శలపై తాజాగా వీజీవో లక్ష్మీ మనోహర్ స్పందించారు. నావిగేషన్ కు సంబంధించిన విమానం ఒకటి తిరుమల మీదుగా వెళ్లిన వైనాన్ని గుర్తించినట్లు చెప్పారు. అయితే.. ఈ విమానం వెళ్లింది సిగ్నల్స్ చెక్ చేసుకోవటానికే తప్పించి మరేమీ కాదన్నారు.

ప్రతి ఏటా రెండు మూడు సార్లు ఇలా నావిగేషన్ విమానాలు వెళుతుంటాయని.. అయినప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మాత్రం విమానం వెళ్లలేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. సీఆర్వో కార్యాలయం మీద సుమారు 5 వేల అడుగుల ఎత్తులో విమానం వెళ్లిన వైనాన్ని ఆయన వెల్లడించారు. దీంతో విమానం తిరుమల కొండ మీదుగా వెళ్లినప్పటికీ.. స్వామి వారి ఆలయం మీదుగా వెళ్లలేదన్న వైనాన్ని తేల్చారు. మిగిలిన వారు ఇలాంటి అంశాల్ని సీరియస్ గా తీసుకుంటారేమో కానీ.. మంత్రి కొడాలి నాని అయితే మరోలా రియాక్టు అయ్యే వారన్న మాట వినిపిస్తోంది.

అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం మీద ఘాటుగా రియాక్టు కావటమే కాదు.. అన్యమతస్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే ఏమవుతుందని ప్రశ్నించటమే కాదు.. ఆ విధానం ఒక్క తిరుమల శ్రీవారికి మాత్రమే ఎందుకు ఉండాలన్న కొత్త పాయింట్ తెర మీదకు తెచ్చిన ఆయన లాంటి వారైతే.. విమానం ఎగిరితే స్వామి అపవిత్రమవుతారని నిలదీసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.