Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ను టార్గెట్ చేసేందుకు స్కెచ్ మారిందే

By:  Tupaki Desk   |   6 Nov 2019 9:21 AM GMT
జ‌గ‌న్‌ను టార్గెట్ చేసేందుకు స్కెచ్ మారిందే
X
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షాల‌కు ఊహించ‌ని అవ‌కాశాలు ఇస్తున్నారా? విప‌క్షాలు ఒక‌దాని త‌ర్వాత ఒక అంశాన్ని ఎత్తుకునే క్ర‌మంలో కీల‌క‌మైన రాజ‌ధాని అమ‌రావ‌తి అంశం ఎత్తుకునేందుకు, దాని విష‌యంలో స్పందిస్తున్న తీరుతో ప‌లువురు ఈ అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ, జ‌న‌సేన, బీజేపీల వైఖ‌రి నేప‌థ్యంలో...ఈ అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. చిత్రంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తావించిన అనంత‌రం విప‌క్షాలు ఈ అస్త్రం ఎత్తుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అమరావతిని మార్చవద్దంటూ గతంలోనే డిమాండ్ చేసిన ప‌వ‌న్ దానికి కొన‌సాగింపుగా...పులివెందులలో రాజధానిని, అక్కడికి దగ్గర్లో ఉండే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వెంట‌నే తెలుగుదేశం పార్టీ స్పందించింది. కేసుల్లో ఉన్నవారు- అమరావతిలో అవినీతి గురించి మాట్లాడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అంతేకాకుండా, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ నేతృత్వంలో నేతల బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించి నిలిచిపోయిన నిర్మాణ పనులను పరిశీలించే ఏర్పాట్లు చేశారు. టీడీపీ హయాంలో చేపట్టిన పనులు, ప్రణాళికలపై టీడీపీ వివరణ ఇవ్వడం, రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, ఖర్చు చేసిన వివరాలను నేతలు విడుదల చేయనున్నారు. ఇక‌, అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

అయితే, విప‌క్షాల‌న్నీఒక్క‌సారిగా ఇలా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను అమ‌రావ‌తి కేంద్రంగా టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇసుక విష‌యంలో విప‌క్షాల‌న్నీ ఏక‌కాలంలో టార్గెట్ చేసి అనంత‌రం....అమ‌రావ‌తి వైపు మ‌ళ్ల‌డం వెనుక అస‌లు విష‌యం... ముఖ్య‌మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేయ‌డమే అంశం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల‌తో ముందుకు సాగుతున్న ముఖ్య‌మంత్రి వీటికి స‌మాధానం ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో..ప్ర‌భుత్వ వైప‌ల్యంగా...చిత్రీక‌రించే ఎత్తుగ‌డ ఉందంటున్నారు.