Begin typing your search above and press return to search.

ఏపీలో పీకే టీం పని చేసే సాహసం చేయలేకపోతోందా?

By:  Tupaki Desk   |   15 Dec 2021 4:58 AM GMT
ఏపీలో పీకే టీం పని చేసే సాహసం చేయలేకపోతోందా?
X
తరచూ రాజకీయ వార్తల్లో దర్శనమిచ్చే పీకే టీం.. తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో జగన్ పార్టీ విజయం సాధించే విషయంలో పీకే టీం కీలకభూమిక పోషించింది. ఎన్నికలకు దాదాపు రెండు.. మూడేళ్లు ముందు నుంచే తాము టార్గెట్ చేసిన రాష్ట్రంలో పని చేసే అలవాటున్న పీకే టీం.. ఏపీలో ఈ పాటికే తమ పనిని మొదలు పెట్టాల్సి ఉంది. ఆ మాటకు వస్తే.. ఈ మధ్యనే మంత్రుల తో భేటీ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అనధికారికం గా పీకే టీం నవంబరు నుంచి పని చేస్తుందని పేర్కొనటం తెలిసిందే.

మరి.. అలాంటప్పుడు ఈ పాటికే పీకే టీం ఏపీలో తమ పనిని మొదలు పెట్టాలి.

కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. డిసెంబరు రెండు వారంలోకి అడుగు పెట్టటమే కాదు.. మూడో వారంలోకి వెళ్లిపోతున్న వేళ.. పీకే టీం మాత్రం ఏపీలో ఇంకా పని మొదలు పెట్టకపోవటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి తమ సేవలు అందించేందుకు పీకే టీం ప్లాన్లు సిద్ధం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

పీకే టీం వస్తుందన్నంతనే పింక్ పార్టీ నేతలు తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే.. అందుకు భిన్నంగా ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీకే టీం.. నియోజకవర్గాల్లో పర్యటించటాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు సుముఖంగా లేరని చెబుతున్నారు. ఇప్పుడు కానీ వారు వచ్చి పని మొదలు పెడితే.. క్షేత్రస్థాయిలో తమ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుస్తుందని.. అదే జరిగితే తమకు జరిగే నష్టం ఎక్కువన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. పీకే టీంకు తమ సహకారం పెద్దగా అందించే పరిస్థితుల్లో లేరంటున్నారు.

ఏపీ లో గ్రామస్థాయిలో తిరిగి.. పార్టీ.. ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటన్న విషయాన్ని తెలుసుకోవాలని పీకే టీం భావించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివేమీ చేసేలా లేదన్న మాట వినిపిస్తోంది. అందుకే.. గ్రామస్థాయిలో కాకుండా.. నియోజకవర్గాలకు పరిమితం కావటం మంచిదన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గుట్టుచప్పుడు కాకుండా పీకే టీం పని చేయటం.. అది కూడా తక్కువమందితో సర్వే పూర్తి చేయాల్సి ఉంటుందంటున్నారు. ఈ కారణంతోనే.. పీకే టీం రంగంలోకి దిగటానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుందన్న మాట వినిపిస్తోంది.