Begin typing your search above and press return to search.

పీకే టార్గెట్ ఆ సీటు... ఆ స్టేట్...?

By:  Tupaki Desk   |   5 May 2022 9:49 AM GMT
పీకే టార్గెట్ ఆ సీటు... ఆ స్టేట్...?
X
పీకే అనబడే ప్రసాంత్ కిశోర్ గట్టి టార్గెట్ తోనే బరిలోకి దిగుతున్నారు. ఎన్నో రాజకీయాలు చూసి అనేక వ్యూహాలతో ఆరితేరిన ఆయనకు ఇపుడు తన టార్గెట్ ఏంటో బాగా అర్ధమైంది అంటున్నారు. ఆయన ఫక్తు బీహారీ బాబు. ఇపుడు అదే బీహార్ కి నవాబు కావాలి అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే సరైన టైమ్ చూసుకుని మరీ పీకే తన రాజకీయ ఆకాంక్షలను వెల్లడించారు.

ఆయన భవిష్యత్తులో జన సురాజ్ యాత్రను చేపడుతున్నట్లుగా చెప్పుకున్నారు. తాను రాజకీయ పార్టీని పెడుతున్నట్లుగా ఎక్కడా ప్రకటించలేదని ఆయన అంటున్నప్పటికీ అసలు వ్యూహం అదే. దాని కోసం ఆయన మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుంచి యావత్తు బీహార్ అంతా పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. జగన్ని పాదయాత్ర చేయమని చెప్పిన పీకేకు తన కాలు కూడా కదపాలని ఆలోచన రావడంలో విశేషం లేదు.

ముందే చెప్పినట్లుగా పీకే అంటే పై వర్గాలకు ఉన్నత స్థాయి సెక్షన్లకు మాత్రమే తెలుసు. ఆయన జనంలోకి వెళ్తేనే జన నేత అవుతారు. ఇక దేశమంతా అంచనాలు రాజకీయ లెక్కలు ఎన్నో వేసిన పీకే సొంత రాష్ట్రంలో కూడా అలాంటి అధ్యయనాలు పక్కాగా చేసుకున్నారు అనే అంటున్నారు. దాంతోనే ఆయన ధైర్యంగా బీహార్ కా నయా నవాబ్ తానే అంటున్నారు.

ఇపుడు ఒక్కసారి బీహార్ రాజకీయ పరిస్థితులను కనుక పరిశీలిస్తే అక్కడ ప్రస్తుతం అధికారంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన గత పదిహేనేళ్ళుగా పాలన చేస్తున్నారు. వయసు ఏడు పదులు దాటింది. ఇక జేడీయూకు ఆదరణ కూడా బాగా తగ్గింది. నితీష్ కి వారసులు లేరు. ఆయన రాజకీయం కూడా ఈ టెర్మ్ తో కంప్లీట్ అవుతుంది.

అంటే ఒక విధంగా నితీష్ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. అది అతి పెద్ద పొలిటికల్ వ్యాక్యూం గానే చూడాలి. ఇంకో వైపు చూస్తే బీహార్ లో బీజేపీ ఎంత కొట్టుకున్నా గట్టిగా ఎనభై సీట్లకు చేరువ కాలేకపోతోంది. ఫుల్ మెజారిటీకి ఎపుడూ ఆ పార్టీ దూరంగా ఉంటోంది. పొత్తులతో అధరపడడం తప్ప బీజేపీ సొంతంగా వచ్చే సీన్ లేదు.

గట్టి నాయకులు ఉన్నా చరిష్మాటిక్ లీడర్ షిప్ అన్నది బీజేపీకి లోటుగా ఉంది. ఇక లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. లాలూ వయోవృద్ధుడు అయ్యారు. ఆయన రాజకీయం చేయలేరు. పైగా అనారోగ్యం, కోర్టు కేసులు, జైలూ బెయిల్ ఇలా సాగుతోంది కధ. ఆయన కొడుకులు ఇద్దరూ రాజకీయంగా ఉన్నా కూడా వారి మధ్యన ఎన్నో విభేధాలు ఉన్నాయి.

తేజస్వీ యాదవ్ పార్టీని గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నా సొంత పార్టీలో, సొంత ఇంటిలోనే ఆయనకు పెద్ద ఎత్తున బ్రేకులు పడుతున్నాయి. ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ మధ్య ఇలా కొన్ని రకాలైన విభేదాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొత్తానికి చూస్తే ఆర్జేడీ మునుపటిలా పటిష్టంగా అయితే లేదు.

ఇలాంటి రాజకీయ సామాజిక సమీకరణల మధ్య కొత్త పార్టీ కనుక వస్తే జనాదరణ కచ్చితంగా ఉంటుంది అని నమ్మే పీకే పార్టీ పెట్టడానికి తయారుగా ఉన్నారు అంటున్నరు. బీహార్ ఎన్నికలు 2025లో జరుగుతాయి. దాని కంటే ముందు 2024లోనే తన సత్తా చాటడం ద్వారా బీహార్ రాజకీయాన్ని ఓడిసిపట్టాలన్నది పీకే ఎత్తుగడ. దానికోసమే ఈ పాదయాత్ర.

బీహార్ వంటి పెద్ద రాష్ట్రానికి సీఎం కావడం అన్నది పీకే టార్గెట్. ఆ తరువాత ఆయన జాతీయ రాజకీయం ఎలాగూ ముందుకు సాగుతుంది. మొత్తానికి విదేశాల్లో చదువుకుని వచ్చిన ఈ బీహారీ బాబు అందరినీ కుర్చీ ఎక్కించిన తాను కూడా అందలం కోరుకుంటున్నారు. అందుకే బీహార్ బాగా వెనకబడిన రాష్ట్రం అని చెబుతున్నారు. మరి ఆయన ఆశలు ఫలిస్తాయా అంచనాలు నిజమవుతాయా అంటే వెయిట్ అండ్ సీ.