Begin typing your search above and press return to search.

పీకే రిపోర్ట్‌... వైసీపీకి షాకింగ్‌..!

By:  Tupaki Desk   |   27 Jan 2022 3:30 PM GMT
పీకే రిపోర్ట్‌... వైసీపీకి షాకింగ్‌..!
X
ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంలో ప‌నిచేసిన చాలా వ్యూహాల్లో ప్ర‌శాంత్ కిషోర్ స్ట్రాట‌జీలు చాలా కీల‌కం. పీకే టీం సోష‌ల్ మీడియా ప్ర‌చారంతో పాటు, ప్ర‌చారం, జ‌గ‌న్ పాద‌యాత్ర‌, కులాల విభ‌జ‌న‌, టీడీపీకి ప‌ట్టుకొమ్మ‌గా ఉండే క‌మ్మ వ‌ర్గాన్ని మిగిలిన కులాల‌కు దూరం చేయ‌డం ఇలా చాలా వ్యూహాలు అమ‌లు చేసి స‌క్సెస్ అయ్యింది. అందుకే ఏపీ చ‌రిత్ర‌లోనే లేని విధంగా జ‌గ‌న్ బంప‌ర్ మెజార్టీతో ఏకంగా 151 సీట్లు సాధించి అధికారంలోకి వ‌చ్చాడు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా జ‌గ‌న్‌కు, పీకేకు మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు అలాగే ఉన్నాయి.

ఇక 2024 ఎన్నిక‌ల కోసం కూడా పీకే టీం అప్పుడే రంగంలోకి దిగి యాక్ష‌న్ ప్లాన్ స్టార్ట్ చేసింద‌నే అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం రంగంలోకి దిగిన పీకే టీం తొలి నివేదిక‌ను ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్‌కు అందించింద‌ని అంటున్నారు. ఈ రిపోర్టుల్లో జ‌గ‌న్ రెండు, మూడు అంశాల‌పై చ‌ర్చించార‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం విరివిగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. ఆదాయం ఉందా ? లేదా ? అన్న‌దానితో సంబంధం లేకుండా జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ వ‌స్తున్నాడు. ఇవే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో త‌న‌ను మ‌రోసారి అధికారంలోకి తీసుకు వ‌స్తాయ‌ని జ‌గ‌న్ ముందు నుంచి ధీమాతో ఉన్నాడు.

అయితే పీకే ఫ‌స్ట్ రిపోర్టు జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు పూర్తి విరుద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది. వాళ్లు సంక్షేమంతో పాటు అప్పుల‌ను కూడా ప‌ట్టించుకుంటున్నార‌ని.. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి గురించి కూడా ఆందోళ‌న చెందుతున్నార‌ని తేలింద‌ట‌. ఒక‌వేళ అప్పులు తేవ‌డం ఆపేస్తే సంక్షేమ ప‌థ‌కాలు ఆగిపోతాయి. అప్పుడు జ‌గ‌న్‌కు మ‌రిన్ని ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వు. ఇక మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ చాలా ప్రాంతాల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ట‌. మూడు రాజ‌ధానుల ఎఫెక్ట్ కృష్నా, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల్లో ఎక్కువుగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతోంద‌ట‌.

ఇక వైజాగ్‌ను రాజ‌ధాని చేస్తే ఉత్త‌రాంధ్ర‌లో త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని వైసీపీ లెక్క‌లు వేసుకున్నా.. అక్క‌డ కూడా రియ‌ల్ వ్యాపార‌మే చేశార‌న్న టాక్ ప్ర‌జ‌ల్లో ఎక్కువుగా ఉంద‌ని పీకే నివేదిక చెప్పేసిందంటున్నారు. ఇక పేరుకు మాత్ర‌మే పేప‌ర్‌పై 151 మంది ఎమ్మెల్యేలు క‌న‌ప‌డుతున్నా.. ఇందులో చాలా మంది ముక్కూ మొహాలు ఇప్ప‌ట‌కీ ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని ప‌రిస్థితి. 60 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌తో కొట్టు మిట్టాడుతున్నారు.

ఇక ప‌లు చోట్ల ఎంపీల‌కు, ఎమ్మెల్యేల‌కు అస్స‌లు ప‌డ‌డం లేదు. అస‌లు కొంద‌రు ఎంపీలు పార్టీలో ఉన్నారా ? వారు ఎంపీలేనా ? అన్న సందేహాలు ఉండ‌నే ఉన్నాయ్‌..! ఇక చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ల‌హాదారుల హ‌వానే న‌డుస్తోంది. ఇవి కూడా పార్టీ నేత‌ల మ‌ధ్య కుంప‌ట్ల‌కు కార‌ణం అవుతున్నాయి. ఈ ప‌రిణామాలే వైసీపీ కొంప కొల్లేరు చేస్తాయ‌ని పీకే నివేదిక చెప్పిన‌ట్టు టాక్ ?