Begin typing your search above and press return to search.

అమ్మ టార్గెట్ చేస్తే అంతే మరి

By:  Tupaki Desk   |   17 July 2016 7:21 AM GMT
అమ్మ టార్గెట్ చేస్తే అంతే మరి
X
‘దేశంలో ఏ ముఖ్యమంత్రినైనా కలవడం సులభం, ఆమె (జయలలిత)ను మాత్రం కలవడం చాలా కష్టం’ అంటూ కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ గత శాసనసభ ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం సృష్టించాయో అందరికీ తెలిసిందే. శాసనసభ ఎన్నికల్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు విపక్షాలకు ప్రచారాస్త్రాలుగా కూడా మారాయి. అలాంటి పీయూష్‌ గోయల్ తాజాగా ముఖ్యమంత్రి జయలలితను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘ఉదయ్‌’ విద్యుత్తు పథకంలో తమిళనాడు ఇప్పటి వరకు చేరలేదు. ఇందులో చేరడానికి తమిళనాడు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జయలలిత - కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది. అయితే రాజకీయ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో స్ప‌ష్ట‌త ఉన్న జ‌య ఈ స‌మావేశంలో గోయ‌ల్‌ కు షాక్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

తమిళనాడు విద్యుత్తు రంగంలో సాధించిన ప్రగతి - కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం - సహకారం గురించి ముఖ్యమంత్రి జయలలిత కేంద్రమంత్రికి వివరించారు. గత ఐదేళ్లలో తమిళనాడు గ్రిడ్‌ కు 8,452 మెగావాట్‌ ల విద్యుత్తును అదనంగా అందించిందని, ఇప్పుడు తమిళనాడు విద్యుత్తు మిగులు రాష్ట్రమని జయ వివరించారు. ఉదయ్‌ పథకంలో చేరడానికి తమిళనాడుకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే దాని కారణంగా రాష్ట్రం ఆర్థిక ప్రయోజనాలకు భంగం వాటిల్లకూడదని, ఇప్పటికే తాను ఈ విషయమై ప్రధానమంత్రికి వివరించానని తెలిపారు. త‌ద్వారా పీయూష్ గోయ‌ల్ ను క‌ల‌వ‌డమ‌నే విష‌యాన్ని ''లైట్'' తీసుకున్న‌ట్లు జ‌య చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌యింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం అనంత‌రం పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ జ‌య‌తో భేటీ కావడం ఎంతో ఆనందంగా ఉందని, సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. రాష్ట్రం కోరుకుంటున్న ‘హరిత విద్యుత్తు’పైన కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.40 వేల కోట్ల విలువైన హరిత విద్యుత్తు ప్రాజెక్టులకు అనుమతులిచ్చారని, తమిళనాడు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ‘ఉదయ్‌’ పథకంలో తమిళనాడు చేరకపోవడంపై ఆయన మాట్లాడుతూ ‘ఈ పథకంలో వాళ్లు చేరవచ్చు, చేరకపోవచ్చు అది వాళ్ల ఇష్టం, ఇందులో ఎలాంటి నిర్బంధం లేదని, తమిళనాడు తన స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు’ అన్నారు. అయితే ఈ పథకంలో చేరడం వల్ల తమిళనాడు రూ.22 వేల కోట్లు ఆదా చేసుకోవచ్చు అని మాత్రమే తాను చెబుతున్నానన్నారు. సౌర విద్యుత్తు ధరను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే యూనిట్‌ సౌరవిద్యుత్తు ధర రూ.5 నుంచీ రూ.4.50లకు తగ్గిస్తామన్నారు. కేంద్రంలో తాము చేపట్టిన చర్యల కారణంగా దక్షిణాది రాష్ట్రాలు మిగులు విద్యుత్తు రాష్ట్రాలుగా మారాయని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. తూర్పు - ఉత్తర గ్రిడ్‌ ల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు పెద్దఎత్తున విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, దాని వల్ల ఇక్కడ విద్యుత్తు మిగులు ఏర్పడిందని, దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు ఇప్పుడు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేసే స్థితికి చేరుకున్నాయన్నారు. 2014లో దేశంలో సౌరవిద్యుత్తు కేవలం 2400 మెగావాట్‌లు ఉత్పత్తి అయితే గత రెండేళ్లలో దాన్ని ఏడు వేల మెగావాట్‌ లకు పెంచామన్నారు.