Begin typing your search above and press return to search.

గోయ‌ల్‌ తో ర‌చ్చ‌...టీడీపీకి మైలేజా...మ‌చ్చా?

By:  Tupaki Desk   |   8 Aug 2018 4:47 PM GMT
గోయ‌ల్‌ తో ర‌చ్చ‌...టీడీపీకి మైలేజా...మ‌చ్చా?
X
అధికార తెలుగుదేశం పార్టీ త‌న ఎత్తుగ‌డ‌ల‌కు మ‌రింత ప‌దును పెడుతోంది. రాజ‌కీయంగా త‌న అవ‌స‌రార్థం రంగులు మార్చ‌డంలో ఆరితేరిన టీడీపీ ఢిల్లీ వేదిక‌గా మ‌రోమారు భిన్నంగా ప్ర‌వ‌ర్తించింది. త‌మ‌కు మైలేజ్ కోసం అని టీడీపీ అనుకుంటున్న‌ప్ప‌టికీ....ఈ ప‌రిణామం ఆ పార్టీకే మైన‌స్ అవుతుంద‌ని చ‌ర్చ వినిపిస్తోంది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...రైల్వే జోన్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు - మంత్రులు - ఎమ్మెల్యేల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కేంద్ర మంత్రి స్పందించాల్సిన అంశాలపై జీవీఎల్‌ మాట్లాడటంతో - టీడీపీ నేతలు ఫైర్‌ అయ్యారు. టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని జీవీఎల్‌ చెప్పడంతో వివాదం ఏర్పడింది. టీడీపీ నేత‌ల తీరు జాతీయ స్థాయిలో వివాదాస్ప‌దంగా మారింది.

విశాఖ రైల్వే జోన్‌ కోరుతూ కేంద్ర మంత్రి పియూశ్‌ గోయల్‌ కు విజ్ఞప్తి చేసేందుకు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసేందుకు టీడీపీ ఎంపీలు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో భాగంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతృత్వంలో ఎంపీలు - ముగ్గురు రాష్ట్ర మంత్రులు - ఉత్తరాంధ్ర జిల్లాల కు చెందిన 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు - 10 మంది ఎమ్మెల్సీలు ఢిల్లీ రైల్‌ భవన్‌ లో పీయూష్‌ గోయల్‌ తో సమావేశమయ్యారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ను ప్రకటించాలని వినతి పత్రం అందించారు. ఇదే సంద‌ర్భంగా ఆర్థిక శాఖను కూడా పీయూష్ గోయ‌ల్‌ చూస్తున్న నేపథ్యంలో.. వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న అంశాన్ని టీడీపీ నేతలు ప్రస్తావించారు. అయితే, అక్క‌డే ఉన్న బీజేపీ ఎంపీ జీవీఎల్‌ జోక్యం చేసుకొని టీడీపీ నేతల తీరును త‌ప్పుప‌ట్టారు. టీడీపీ నేత‌లు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.

దీంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆగ్రహించారు. సీట్లలో నుంచి లేచి జీవీఎల్‌ పై మండిపడ్డారు. ''ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడడానికి మీరెవరు? అసలు ఏపీ గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నారు? మేం కేంద్రమంత్రిని అడుగుతుంటే మీరెందుకు స్పందిస్తున్నారు? అసలు మీరెందుకు వచ్చారు?'' అని జీవీఎల్‌ ను నిలదీశారు. అనంతరం సుజనా చౌదరి కల్పించుకుని.. ''మేం కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఆయనే మాకు దీనిపై వివరణ ఇవ్వాలి. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు. ఏ హోదాతో మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు'' అంటూ జీవీఎల్‌ కు సూటిగా సమాధానం చెప్పారు అయితే ''ఆంధ్రకు ద్రోహం చేయాలని చూస్తే మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వం '' అంటూ అని కళా వెంకట్రావు పేర్కొనగా... 'నువ్వేం చేస్తావ్‌' అని జీవీఎల్‌ ఎదురుదాడికి దిగారు. తాను మాట్లాడి తీరతానని తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ నేతలు మరింత మండిపడ్డారు. 'యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు... ఏపీతో ఏం సంబంధం?' అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. దీంతో సమావేశంలో ఎవరు పాల్గొనాలో మీరెలా నిర్ణయిస్తారని జీవీఎల్‌ ఎదురుదాడికి దిగారు. ఇలా మాటామాటా పెరగడంతో సమావేశ మందిరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టీడీపీ నేత‌ల తీరును చూసి ఆశ్చ‌ర్య‌పోయిన కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్‌ - ఎంపీలు జీవీఎల్‌ - హరిబాబు తన కార్యాలయంలోకి వెళ్లిపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. గోయల్‌ - జీవీఎల్‌ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు రైల్‌ భవన్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. టీడీపీ నేతలకు సమయం కేటాయించేందుకు పీయూష్‌ రోజంతా మొరాయించారు. చివరికి సమయం కేటాయించినా... రెండుగంటలు నిరీక్షించేలా చేశారు. ఇదిలాఉండ‌గా...ఈ ప‌రిణామాన్ని తాము కేంద్రాన్ని నిల‌దీశామ‌ని పేర్కొంటుండ‌గా మ‌రోవైపు ఈ ఎపిసోడ్‌ పై ప‌లువురు భిన్న‌మైన వాద‌న వినిపిస్తున్నారు. కేంద్ర‌మంత్రి హోదాలో ప‌నిచేసిన వ్య‌క్తులు - ఎంపీలు - సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులుగా ఉన్న వారు కేబినెట్ మంత్రి కార్యాల‌యంలో ఏ విధంగా ప్ర‌వ‌ర్తించాలో తెలుసుకోలేక‌పోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వేళ జీవీఎల్ తీరు అభ్యంత‌రక‌రంగా ఉంటే...నిర‌స‌న తెల‌పాలే త‌ప్పించి...వాదోప‌వాదాలు పెంచుకోవ‌డం చిత్రంగా ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌ - సంప్ర‌దాయాల‌కు త‌మ పార్టీ పెద్ద‌పీట వేస్తుంద‌ని పేర్కొనే చంద్ర‌బాబు ఆండ్ కో ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ఏమిట‌ని వ్యాఖ్యానిస్తున్నారు.