Begin typing your search above and press return to search.

నవ్యాంధ్ర ప్రజల నిజాయితీని మెచ్చుకున్న కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   25 Jun 2016 9:42 AM GMT
నవ్యాంధ్ర ప్రజల నిజాయితీని మెచ్చుకున్న కేంద్ర మంత్రి
X
ఏపీ ప్రజలకు అనుకోని ప్రశంసలు దక్కాయి.. ముఖ్యంగా నవ్యాంధ్ర ప్రజల నిజాయితీ గురించి కేంద్ర మంత్రి ఒకరు ప్రశంసలు కురిపించారు. ఏపీలో పర్యటనలో ఉన్న కేంద్ర విద్యుత్ - బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా నెల్లూరులో స్మార్టు ఎలక్ట్రిక్ మీటర్ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఏపీ ప్రజల నిజాయితీని ప్రశంసించారు.

స్మార్టు మీటర్ల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి పథకంలో భాగంగా చేపట్టారు. విద్యుత్ సదుపాయం లేని మారుమూల గ్రామాలకు కరెంటు ఇవ్వడం లక్ష్యంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి ఏపీ ప్రజల విద్యుత్ చెల్లింపుల తీరుకు ముచ్చట పడ్డారు. ఇక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు కరెంటు బిల్లులు కట్టేస్తుంటారని.. అలాంటి నిజాయితీ మరే ప్రాంతంలోనూ కనిపించదని అన్నారు.

దేశంలో వందశాతం విద్యుత్ కనెక్షన్లు అందించిన మూడో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇప్పటివరకు గుజరాత్ - పంజాబ్ మాత్రమే వందశాతం విద్యుద్దీకరణ సాధించాయని పీయూష్ గోయల్ చెప్పారు. సో... ఏపీని అగ్రస్థానంలోకి తెస్తానన్న చంద్రబాబు మాటలు కేంద్రం సహకారంతో ఒక్కటొక్కటిగా నిజమవుతున్నాయన్న మాట.