Begin typing your search above and press return to search.

హెల్మెట్ లేకుండా కేంద్రమంత్రుల బైక్ రైడింగ్

By:  Tupaki Desk   |   17 Aug 2016 9:22 AM GMT
హెల్మెట్ లేకుండా కేంద్రమంత్రుల బైక్ రైడింగ్
X
చట్టాలు తయారు చేసే వారే చట్టాల్ని ఉల్లంఘిస్తే? రూల్స్ ను బ్రేక్ చేయటమే కాదు.. దాన్ని కవర్ చేస్తూ వాదనలు వినిపిస్తే..? తప్పు మీద తప్పు చేసిన కేంద్రమంత్రుల మీద ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొరపాటున తప్పు జరిగితే.. అవునని ఒప్పుకొని లెంపలు వేసుకుంటే ముగిసే ఎపిసోడ్ ను తెలుగు డైలీ సీరియస్ మాదిరి సాగదీసే ధోరణి కొందరు రాజకీయ నాయకులు చేస్తుంటారు. తాజాగా.. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్.. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లు చేసిన పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. కేంద్రమంత్రులు ఇద్దరు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపారు. జైపూర్ లో జరిగిన ఈ ఘటనలో కేంద్రమంత్రులే చట్టాన్ని ఉల్లంఘించటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తిరంగా యాత్రలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ లు పాల్గొన్నారు.

కతిపుర నుంచి థాంక్యా వరకూ చేపట్టిన బైక్ ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు ఇద్దరూ ట్రాఫిక్ రూల్స్ కు భిన్నంగా హెల్మెట్ లేకుండా బండిని నడపటం వివాదాస్పదంగా మారింది. హెల్మెట్ లేకుండా బైక్ ను ఎలా నడుపుతారంటూ మీడియా వేసిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు చిత్రమైన వాదనను వినిపించారు. హెల్మెట్ లేకున్నా.. తలపాగా ఉంటే ఏమీ కాదంటూ సమాధానం ఇచ్చారు. తలపాగా ధరించి కూడా బైక్ నడపటం చట్టబద్ధమంటూ సెలవివ్వటం గమనార్హం ఇదిలా ఉంటే.. అక్కడి పోలీసులు మాత్రం కేంద్రమంత్రులకు చట్టం మీద అవగాహన లేకపోవటంతో అలా చేసి ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. అవగాహన లేకుండా కేంద్రమంత్రులు తప్పు చేస్తే పోలీసులు సైతం చూస్తూ ఉరుకుండిపోవటం ఏమిటి?