Begin typing your search above and press return to search.

లేఖతో మాష్టార్ని కడిగేసిన ఐకాస నేతలు

By:  Tupaki Desk   |   2 March 2017 5:33 AM GMT
లేఖతో మాష్టార్ని కడిగేసిన ఐకాస నేతలు
X
నిన్నమొన్నటి వరకూ అందరికి ఆదర్శప్రాయుడిగా కనిపించిన కోదండం మాష్టారి ఇమేజ్ ఇప్పుడు మారిపోతోంది. బయట వారి సంగతి తర్వాత.. సొంతింట్లోనే (తెలంగాణ రాజకీయ జేఏసీ) ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. చేసిందేమీ లేకున్నా.. పేరు ప్రఖ్యాతుల్ని కొల్లగొట్టేస్తున్నారే? అంటూ సూటిగా ప్రశ్నించటమే కాదు.. మీరు చేసిన త్యాగాలేంటో చెప్పండంటూ లేఖను సంధించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర అధికారపక్షంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కోదండరాం.. ప్రభుత్వంపై పోరుకు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించాలన్న కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఐకాసలో లుకలుకలు బయటకు రావటం గమనార్హం.

ఎప్పుడూ లేని విధంగా ఐకాస నేతలు కోదండం మాష్టారిపై ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ లేఖలో కోదండం మాష్టారిపై ఘాటైన విమర్శలతో పాటు.. తెలంగాణ ఉద్యమ మైలేజీ మొత్తాన్ని తన ఖాతాలో ఆయన వేసుకున్నారంటూ ఆరోపించటం కనిపిస్తుంది. త్యాగాల చరిత్ర మీకులేదన్నసూటి మాటలతోపాటు.. దళిత.. బహుజనులంటే బానిసలన్న భావనతో ఉంటారని.. అందరూ తన ఆదేశాల్నే పాటించాలనే ధోరణి మీలో ఎక్కువనే ఘాటు విమర్శను చేయటం కనిపిస్తుంది.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎవరికి తెలీకుండా.. ప్రైవేటుగా రాసిన లేఖాస్త్రం ఇప్పుడు మీడియా చేతిలో పడటంపై లేఖ రాసిన పిట్టల రవీందర్.. ప్రహ్లాద్ లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా రాసుకున్న లెటర్ బయటకు రావటం ఏమిటని? వారు ప్రశ్నిస్తున్నారు. ఓపక్క ముఖ్యమంత్రి పాలనా తీరుపై కోదండం మాష్టారుతీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.. కోదండంపైనా.. ఐకాస నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తీరు చూస్తే.. లెక్క బ్యాలెన్స్ సరిపోయినట్లుగా కనిపించట్లేదు..?

ఇక.. లెటర్ విషయానికి వస్తే.. కోదండం మాష్టార్ని ఉతికి ఆరేసినంత పని చేశారు. సూటిగా నిలదీస్తూ.. కడిగేయటం కనిపిస్తుంది. ఇటీవల కాలంలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా చేస్తున్న ప్రకటనలు.. వెల్లడిస్తున్న అభిప్రాయాలు.. జేఏసీ రాజకీయ అవగాహనకు పూర్తి భిన్నంగా ఉన్నట్లుగా వారు తెగబడటం కనిపిస్తుంది. ఇక.. లేఖలో ప్రస్తావించిన అంశాల్ని చూస్తే.. జేఏసీ మీద తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆదరణ మొత్తం.. కోదండం మాష్టారి ఒక్కరి వల్ల ఎంత మాత్రం కాదని స్పష్టం చేయటంతో పాటు.. ‘‘ఇది సమిష్టి కృషి. అనేక మంది త్యాగాల ఫలితం. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా మేమంతా ఆమోదించటం వల్లే మీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తున్నాయి.కానీ.. ఈ వాస్తవాన్ని మీరు గుర్తించటం లేదు. మీ వల్లనే మా అందరికి పేరు వస్తుందని అనుకుంటున్నారు. ప్యూడల్ స్వభావానికి ఇదో నిదర్శనం. ఇటీవల కాలంలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా మీరు చేస్తున్నప్రకటనలు.. వెల్లడిస్తున్న అభిప్రాయాలు జేఏసీ ఆలోచనలకు భిన్నంగా ఉంటున్నాయి. జేఏసీలో తొలి నుంచి పని చేస్తున్న మాలాంటి అనేక మందికి ఉన్న త్యాగాల చరిత్ర మీకు లేదు’’ అని మండిపడ్డారు.

‘‘తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగం ఏమిటో కనీసం ఒక్కటైనా చెప్పగలుగుతారా? మీరు ఉద్యోగం చేసుకున్నారు. పదోన్నతి పొందారు. ఇప్పుడు పింఛన్ అందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు చేసిన త్యాగం ఏమిటో ఒక్కటైనా చెప్పగలరా?అనేక మంది ఆత్మబలిదానాలు.. ఫలితాన్న కీర్తి కిరీటంగా ధరించి.. మీ సొంత ఖాతాలో జమ వేసుకున్నారు. ఆప్ తరహాలో తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అవసరమని మీరు చెబుతున్నారు. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వీరు.. అదే వేదిక మీద నుంచి రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి లా వ్యాఖ్యానిస్తారు? ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఉంటే.. ముందు ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాతే వ్యాఖ్యలు చేయాలి’’ అంటూ మండిపడ్డారు. మొత్తానికి తెలంగాణ జేఏసీ నుంచి కోదండం మాష్టారిని బయటకు పంపాలన్న ప్రయత్నాలు మొదలైన ముచ్చట తాజా లేఖ స్పష్టం చేస్తుందని చెప్పాలి. మరి.. దీనిపై మాష్టారి రియాక్షన్ ఇప్పుడు అందరిలో ఉత్కంట రేపుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/