Begin typing your search above and press return to search.

కేర‌ళ సీఎంగా మ‌రోమారు పిన‌ర‌యి... కేబినెట్ మొత్తం కొత్త‌దే!

By:  Tupaki Desk   |   19 May 2021 3:30 AM GMT
కేర‌ళ సీఎంగా మ‌రోమారు పిన‌ర‌యి... కేబినెట్ మొత్తం కొత్త‌దే!
X
ప‌రిణ‌తి చెందిన పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే కేర‌ళ‌లో ఎల్డీఎఫ్ కూట‌మి వ‌రుస‌గా రెండోసారి విక్ట‌రీ కొట్టి రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో సీఎంగా వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం కూడా పిన‌ర‌యి విజ‌య‌నే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌డుతున్నారు. ఈ నెల‌ 20న కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. అయితే త‌న తొలి స‌ర్కారులో మంత్రులుగా కొన‌సాగిన ఏ ఒక్క‌రికి కూడా ఈ ద‌ఫా మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేదు. పిన‌ర‌యి తాజా కేబినెట్ మొత్తం కొత్త ర‌క్తంతో నిండ‌నుంది. మొత్తం 11 మంత్రి ప‌ద‌వులు కూడా కొత్త‌వారికే ద‌క్కాయి. మేర‌కు సీపీఎం ఆధ్వ‌ర్యంలోని ఎల్డీఎఫ్ కూట‌మి మంగ‌ళ‌వారం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

కేర‌ళలో అధికార కూట‌మిగా వ‌రుస‌గా రెండోసారి ఎన్నికైన ఎల్టీఎఫ్ కూట‌మి శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా పిన‌ర‌యి ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సీపీఎం రాష్ట్ర క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది. అదే స‌మ‌యంలో మొన్న‌టిదాకా పిన‌ర‌యి కేబినెట్ లో మంత్రులుగా కొన‌సాగిన సీనియ‌ర్ నేత‌లు ఏ ఒక్క‌రికి కూడా ఈ ద‌ఫా అవ‌కాశం క‌ల్పించ‌లేదు. పిన‌ర‌యి తొలి కేబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా ప‌నిచేసి త‌న‌దైన శైలి గుర్తింపు తెచ్చుకున్న‌ కేకే శైలజకు మాత్రం పార్టీ విప్‌గా ప‌ద‌వి ద‌క్కింది. ఈ ద‌ఫా పిన‌ర‌యి కేబినెట్ లో 11 మంది మంత్రులుగా ప్ర‌మాణం చేయనుండ‌గా... పిన‌ర‌యితో పాటు ఆ 11 మంది ఎవ‌ర‌న్న విష‌యాన్ని కూడా సీపీఎం రాష్ట్ర క‌మిటీ ప్ర‌క‌టించేసింది. ఈ జాబితాలో అధిక శాతం మంది యువ‌కులే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక‌రిద్ద‌రు అనుభ‌వ‌జ్ఞుల‌కు కూడా అవ‌కాశం ద‌క్కింది.

కొత్త కేబినెట్ లో మంత్రులుగా అవ‌కాశం ద‌క్కించుకున్న వారిలో ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పీ రాజీవ్, వీఎన్ వాసవన్, సజి చెరియన్, వీ శివన్ కుట్టి, మహమ్మద్ రియాస్, డాక్టర్ ఆర్ బిందు, వీణా జార్జి, వీ అబ్దుల్ రహమాన్ లు ఉన్నారు. ఇక శాసన సభ సభాపతి పదవికి ఎంబీ రాజేశ్‌ను, పార్టీ విప్‌గా కేకే శైలజను ఎంపిక చేసిన సీపీఎం రాష్ట్ర క‌మిటీ... పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా టీపీ రామకృష్ణన్‌ను నియమించింది. ఇక పిన‌ర‌యి తొలి కేబినెట్ లో కీల‌క మంత్రులుగా కొన‌సాగిన థామస్ ఐజాక్, ఈపీ జయరాజన్, జీ సుధాకరన్ వంటివారిని సీపీఎం రాష్ట్ర క‌మిటీ ఏకంగా ఎన్నికల బరి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన మంత్రుల‌కు కూడా పిన‌ర‌యి కొత్త కేబినెట్ లోకి తీసుకోవ‌డం లేద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.