Begin typing your search above and press return to search.

ఏపీ హోంమంత్రికి అధికార పార్టీ పెద్దమనిషి లేఖ

By:  Tupaki Desk   |   16 Nov 2020 10:45 AM IST
ఏపీ హోంమంత్రికి అధికార పార్టీ పెద్దమనిషి లేఖ
X
ఏపీ అధికారపక్షంలో వివాదాలకు అతీతంగా ఉంటారని పేరున్న కొందరు నేతల్లో మాజీ మంత్రి.. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరు. జగన్ మీద ఆయనకున్న అభిమానం అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏ వివాదంలోకి తలదూర్చకుండా తన పని తాను చేసుకుంటూ పోయే ఆయన.. తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. లేఖ రూపంలో ఓపెన్ కావటం హాట్ టాపిక్ గా మారింది.

పార్టీ నేత తోట త్రిమూర్తుల్ని లక్ష్యంగా చేసుకొని పిల్లి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర హోం మంత్రి సుచరితకు ఆయనో లేఖ రాశారు. దళితుల శిరోముండటం కేసు విచారణను వేగవంతం చేయాలని కోరిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఈ కేసులో ఏ1గా తోట త్రిమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు.

ఇరవై ఏళ్లుగా కేసు తేలకుండా తన పలుకుబడితో తెలివిగా వ్యవహరిస్తున్నట్లుగా పిల్లి ఆరోపించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన బాధితులు త్రిమూర్తులతో పోరాడే స్థాయి లేని నిస్సహాయులుగా పిల్లి పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను మార్చే ప్రయత్నం జరుగుతుందన్న సంచలన ఆరోపణను చేశారు.

ఇప్పటికే ఏపీ అధికారపక్షానికి చెందిన పలువురు నేతల మధ్య లొల్లి నడుస్తున్న వేళ.. తాజాగా పెద్ద మనిషిగా పేరున్న పిల్లి సైతం ఓపెన్ కావటం గమనార్హంగా మారింది. అంతేకాదు.. ఇటీవల కాలంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై జగన్ సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన సమయం వచ్చిందన్న మాట వినిపిస్తోంది.