Begin typing your search above and press return to search.

ఆంధ్రజ్యోతి కథనంపై పిల్.. కొట్టేయండి: ప్రభుత్వం

By:  Tupaki Desk   |   9 Oct 2020 3:45 PM IST
ఆంధ్రజ్యోతి కథనంపై పిల్.. కొట్టేయండి: ప్రభుత్వం
X
న్యాయమూర్తుల ఫోన్లను ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం పబ్లిష్ అయిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యి ఆ పత్రికకు లీగల్ నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం గతంలోనే తెలిపింది.

తాజాగా ఈ కేసు హైకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన ‘న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్’ కథనం ఆధారంగా విశాఖపట్నంకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. ఈ వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపింది.

ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన నిరాధార తప్పుడు కథనాన్ని ఆధారంగా చేసుకొని దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టును అభ్యర్థించింది. ఈ వార్తా కథనం ప్రామాణికతను తెలుసుకోకుండా ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం ద్వారా పిటీషనర్ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపింది. తప్పుడు కథనం ప్రచురించిన ఆ పత్రికకు ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశామని.. తదుపరి చుర్యలు ఉంటాయని ప్రభుత్వం లాయర్ వివరించారు.

ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తామనడంతో హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఈ కేసును చేపట్టిన ప్రభుత్వ లాయర్ కరోనాతో బాధపడుతున్నారని తెలిసి హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.