Begin typing your search above and press return to search.

ప్రణబ్ ఫ్లైట్ కి అడ్డంకిగా మారిన పందుల గుంపు

By:  Tupaki Desk   |   16 Sep 2015 6:14 AM GMT
ప్రణబ్ ఫ్లైట్ కి అడ్డంకిగా మారిన పందుల గుంపు
X
దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఉన్న విమానం ఎయిర్ పోర్ట్ లో దిగుతుంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? పొంచి ఉన్న ఉగ్రవాద భయంతో పాటు.. సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇచ్చేలా అధికారులు వ్యవహరించటంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏకంగా రాష్ట్రపతి ప్రయాణిస్తున్న విమానం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుంటే ఏన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వైనం విస్మయానికి గురి చేస్తుంది. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం రన్ వే మీద దిగి.. టెర్మినల్ బిల్డింగ్ వైపు విమానం వెళుతున్న సమయంలో ఎనిమిది పందుల సమూహం ఒక్కసారిగా రన్ వే మీద పరుగులు తీయటం కలకలం రేపింది.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండాల్సిన రాష్ట్రపతి ప్రయాణిస్తున్న విమానం దిశగా పందుల సమూహం పరుగులు పెట్టటం అధికారులకు ముచ్చమటలు పట్టేలా చేసింది. వెంటనే స్పందించిన సిబ్బంది పందుల సమూహాన్ని తోలేసి ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. జరిగిన ఘటనపై విమానయాన శాఖ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు.. పందుల గుంపు రావటానికి కారణం ఎయిర్ పోర్ట్ సరిహద్దు గోడ కూలిపోవటంతో.. అందులో నుంచి పందులు ప్రవేశించాయని భావిస్తున్నారు. రాష్ట్రపతి లాంటి వీవీఐపీ వస్తున్నప్పుడు విమానాశ్రయం చుట్టు ఉన్న రక్షణ గోడ ఎలా ఉంది? దెబ్బ తిని ఉంటే ప్రమాదమన్న విషయంపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.