Begin typing your search above and press return to search.

ప్రయోగం విఫలం.. పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి

By:  Tupaki Desk   |   10 March 2022 5:58 AM GMT
ప్రయోగం విఫలం.. పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి
X
ప్రపంచ వైద్య చరిత్రలో అసాధ్యం అనుకున్న దాన్ని అమెరికా వైద్యులు సుసాధ్యం చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ పంది గుండె ను శస్త్రచికిత్స చేసి ఓ వ్యక్తి అమర్చారు. అయితే ఈ చరిత్ర చెరిగి పోయేందుకు ఎక్కువ కాలం పట్టలేదు. పంది గుండెను అమర్చిన ఆ వ్యక్తి మంగళవారం కన్నుమూశారు. డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తి ఇటీవల తన ఆరోగ్యం బాగాలేదని అమెరికా లోని మేరీలాండ్ ఆస్పత్రిలో చేరారు. అయితే సంబంధిత చికిత్స చేసిన తర్వాత ఆయనకు ఓ పంది గుండెను అమర్చారు.

అమర్చిన కొద్ది రోజులు వరకు ఆయన హార్ట్ ఫంక్షనింగ్ చాలా బాగుంది. ఇదే విషయాన్ని వైద్యులు కూడా దృవీకరించారు. అయితే అవయవాల మార్పిడి జరిగిన నాటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వచ్చింది. చివరకు మంగళవారం ఆయన ఆసుపత్రిలోనే చనిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యక్తి చనిపోయిన విషయాన్ని మాత్రం ఆస్పత్రి వర్గాలు బుధవారం ప్రకటించాయి.

బెన్నెట్ కు పంది గుండె అమర్చిన తర్వాత వైద్య రంగంలో ఇది ఓ సంచలనంగా చెప్పుకొచ్చారు. అవయవాల మార్పిడి ఓ కీలక ముందడుగు పడినట్లు చెప్పారు. మరిన్ని ప్రయోగాలకు ఈ ప్రక్రియ బీజం పడినట్లు భావించారు. కానీ శస్త్రచికిత్స పూర్తి అయిన కొద్ది రోజులకే ఇలా జరగడం వారిని వెనకడుగు వేసేలా చేసిందని చెబుతున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే బన్నెట్ చనిపోవడానికి గల కచ్చితమైన సమాచారాన్ని అయితే వైద్యులు చెప్పలేదు. ఏ విధంగా చనిపోయారు... ఎందుకు చనిపోయారు అనే దానిపై వైద్యులు వివరణ ఇవ్వాల్సి ఉంది.

మనిషి నుంచి మనిషికి అవయవాల మార్పిడి చేయడం అనేది ప్రస్తుతం చాలా సర్వ సాధారణంగా మారింది. కానీ ఇతర జంతువుల నుంచి అవయవాలను సేకరించి వాటిని మానవులకు అమర్చే పద్ధతి ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుంది. ఈ విధాన్నాన్ని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఇలా చేసిన కొన్ని సర్జరీల్లో కొన్ని విజయవంతం అయ్యాయి. మరికొన్ని విఫలం అయ్యాయి. అయితే రెండు నెలల కిందట బెన్నెట్ కు అమర్చిన పంది గుండె శస్త్రచికిత్స కచ్చితంగా విజయం అవుతుందని వైద్యులు అందరూ భావించారు. కానీ కొద్ది రోజులకే ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

చావుకు కచ్చితంగా పంది గుండెను అమర్చడం అనేది కారణం కాకపోవచ్చు అని బెన్నెట్ కుమారుడు జూనియర్ బెన్నెట్ అన్నారు. ఈ ఏడాది జనవరి 7న జరిగిన ఈ అరుదైన శస్త్ర చికిత్స ద్వారా ఆయన తన ఆయుష్షుని మరో రెండు నెలలు పాటు పెంచుతున్నట్లు చెప్పారు. గతంలో వివిధ అనారోగ్య రుగ్మతలతో తన తండ్రి చావుకు చాలా దగ్గర ఉన్నట్టు పేర్కొన్నారు. తన తండ్రిని కాపాడేందుకు ఆసుపత్రి సిబ్బంది చాలా కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే గతంలో వైద్యులు చేపట్టిన జంతువుల అవయవాల మార్పిడి ప్రయోగాలు కొన్ని విఫలమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. సుమారు 40 ఏళ్ల కిందట... ఒక కోతి గుండెను ఓ వ్యక్తికి అమర్చారు. అయితే ఇది జరిగిన కేవలం 21 రోజుల్లో ఆ వ్యక్తి చనిపోయినట్లు పేర్కొన్నారు. అయితే బెన్నెట్ విషయంలో చూస్తే వైద్యులు కొంతమేర విజయం సాధించినట్లు తెలుస్తోంది.