Begin typing your search above and press return to search.

మనిషికి పంది గుండె... సర్జరీ సక్సెస్

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:02 AM IST
మనిషికి పంది గుండె... సర్జరీ సక్సెస్
X
ప్రపంచ వైద్య చరిత్రలో అమెరికా కు చెందిన డాక్టర్లు సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న 57 ఏళ్ల వృద్ధుడికి శస్త్రచికిత్స చేశారు. ఏకంగా పంది గుండెను అతనికి అమర్చారు. ప్రపంచ వైద్య చరిత్రలో ఇలా ఒక జంతువు గుండెను మానవునికి అమర్చడం ఇదే తొలిసారి అని అమెరికన్ వైద్యులు తెలిపారు.

ఇప్పటి వరకు ఇలాంటి సర్జరీ ఎప్పుడు జరగలేదని పేర్కొన్నారు . రోగి వయసు ఎక్కువగా ఉన్నా కానీ సర్జరీని సులభంగా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఇందుకు రోగి శరీరం కూడా సహకరించినట్లు చెప్పారు. ఈ సర్జరీ విజయవంతం చేయడానికి తాము సుమారు ఎనిమిది గంటల పాటు కష్ట పడినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ఇలా ఒక జంతువు గుండెను మానవునికి విజయవంతంగా అమర్చడం ద్వారా ఇప్పటి వరకు ఎవరు చేయలేని సాహసాన్ని తాము చేసి చూపించినట్లు అమెరికా వైద్యులు చెప్పారు.

అమెరికాలోని మేరీల్యాండ్ కు చెందిన డేవిడ్ బెన్నెట్ అనే ఓ వ్యక్తి గత కొద్ది కాలంగా గుండె జబ్బు తో బాధపడుతున్నాడు. ఇప్పటికే చాలా సార్లు వైద్యులను సంప్రదించి తన రోగాన్ని నయం చేయాలని కోరారు. దీంతో మేరీలాండ్ యూనివర్సిటీ లోని మెడికల్ సెంటర్ డాక్టర్ డేవిడ్ కు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు.

అవయవాల కొరత కారణంగా పంది గుండెను అతనికి అమర్చేందుకు ముందు పరీక్షలు నిర్వహించారు. ఇందుకోసం వారు చాలా అధ్యయనం చేశారు. చివరకు పంది గుండెను అమర్చగలమని నమ్మారు. దీంతో అనుకున్న దాని ప్రకారం హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ ను పూర్తి చేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంపై డాక్టర్లు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ పూర్తి అయిన తర్వాత కూడా డేవిడ్ సుమారు 72 గంటల పాటు ఆస్పత్రిలో ఉంచారు. పూర్తిస్థాయిలో అబ్జర్వేషన్లో ఉంచిన అతనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని భావించిన తరువాత వైద్యులు చివరకు కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. అంతే కాకుండా కొత్తగా అమర్చిన పంది గుండె అతని శరీరంలో సరిగ్గా ఇమిడినట్లు పేర్కొన్నారు.

గుండె పనితీరు కూడా ప్రస్తుతం స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. పంది గుండెను డేవిడ్ కు అమర్చేందుకు డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా సేకరించిన పంది గుండె కు జన్యుపరమైన కొన్ని మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రయోగాత్మకంగా ఈ సర్జరీని చేపట్టినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఎవరూ అనుకోని విధంగా ఇది విజయవంతం అయ్యిందని వైద్యులు చెప్పారు.

గుండె జబ్బుతో బాధ పడుతున్న డేవిడ్ మొదట మేరీల్యాండ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వైద్యులను కలిశారు. అయితే సర్జరీ అనేది తప్పక చేయాల్సి వస్తుందని వైద్యులు అతనికి సూచించినట్లు పేర్కొన్నారు. లేకపోతే చనిపోయే ప్రమాదం ఉందని చెప్పినట్లు స్పష్టం చేశారు. దీంతో ప్రాణాలను లెక్కచేయకుండా ఈ సర్జరీ కోసం వైద్యులకు సహకరించినట్లు డేవిడ్ చెప్పారు. ఈ సర్జరీ విజయవంతం కావడంతో మరిన్ని సర్జరీ లకు వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో అవయవాల కొరత ఎక్కువగా ఉందని తెలిపిన వైద్యులు... త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.