Begin typing your search above and press return to search.

దేశంలో ‘ఫోన్ ట్యాపింగ్’ సంచలనం : ఖండించిన పెగాసస్

By:  Tupaki Desk   |   19 July 2021 10:30 AM GMT
దేశంలో ‘ఫోన్ ట్యాపింగ్’ సంచలనం : ఖండించిన పెగాసస్
X
దేశంలోని కేంద్రమంత్రులు, జర్నలిస్టులు, సుప్రీంకోర్టు జడ్జీల ఫోన్లు హ్యాక్ చేసి వారి సమాచారం సేకరించారని తాజాగా గుప్పుమంది. ఇజ్రాయెల్ కు చెందిన ‘పెగాసస్’ అనే స్పై సాఫ్ట్ వేర్ ద్వారా చేశారని.. దాని డేటా బేస్ లో కనుగొన్నామంటూ వైర్, సహా కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. స్పైవేర్ ద్వారా హ్యాకర్లు దేశంలోని ప్రముఖుల ఫోన్ డేటాను చోరీ చేశారని ‘దివైర్’ ఆదివారం ఓ కథనం ప్రచురించి సంచలనం సృష్టించింది.

ఇజ్రాయెల్ కు చెందిన ఎస్ఎస్ఓ అనే సంస్థ తయారు చేసిన స్పైవేర్ టూల్ ‘పెగాసస్’. వ్యక్తుల మీద నిఘా పెట్టడమే ఈ పెగాసస్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఫోన్లు ఉన్న వినియోగదారులకు ఒక లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు ఆ యూజర్ ఫోన్ పూర్తిగా ఎవరైతే హ్యాక్ చేస్తున్నారో వారి స్వాధీనంలోకి వెళ్లిపోతుంది. యూజర్ కు తెలియకుండానే ఆ టూల్ అతడి ఫోన్ లో ఇన్ స్టాల్ అవుతుంది. ఒక సారి ఇన్ స్టాల్ అయ్యాక ఫోన్ కు సంబంధించిన డేటానంతా ఎటాకర్ కు పంపించడం మొదలుపెడుతుంది. వ్యక్తిగత డేటాతోపాటు పాస్ వర్డ్స్, కాంటాక్ట్ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్, ఈమెయిల్స్ తోపాటు లైవ్ వాయిస్ కాల్స్ ను కూడా ఇది ట్రాక్ చేస్తుంది.ఆఖరికి యూజర్ కు తెలియకుండా అతడి ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్ ను కూడా ఆన్ చేసి విని, చూడగలిగే సామత్యం హ్యాకర్ కు ఉంటుంది. ఇప్పుడు ఒక మిస్డ్ వీడియో కాల్ చేసి కూడా ఫోన్ ను ఈ కొత్త ‘పెగాసస్’ సాఫ్ట్ వేర్ హ్యాక్ చేస్తోందని ‘వాట్సాప్’ ఆరోపించింది.

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో దాదాపు 20 దేశాల్లో దాదాపు 1400 మందికి పైగా పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని వాట్సాప్ సంచలన ఆరోపణలు చేసినట్టు విదేశీ మీడియా తెలిపింది. ఇప్పటికే పెగాసస్ పై వాట్సాప్ సంస్థ శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా కూడా వేసింది.

ఇప్పుడు ఇదే ఇజ్రాయలీ పెగాసస్ సంస్థ భారత్ లో నిఘాకు వినియోగించారన్న వార్తలు బయటకు రావడంతో పెను సంచలనమైంది. దీన్ని కేంద్రం చేసిందా? లేక దీనివెనుక ఎవరున్నారన్నది నిగ్గుతేలాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద స్థాయిలో ఇంతపెద్ద ప్రముఖులపై 2019 సార్వత్రిక ఎన్నికల వేళ సాగిన ఈ తంతు ఇప్పుడు దేశాన్ని కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది.

దీనిపై స్వయంగా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు. ‘దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ‘వాషింగ్టన్ పోస్ట్, లండన్ కు చెందిన గార్డియన్ పత్రికలు’ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రచురించాయని.. పెగాసస్ ద్వారా దేశంలో ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని తెలిసిందని.. వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో జాబితా వెల్లడిస్తానని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.

అయితే వైర్ సహా అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు, ఆరోపణలు నిరాధారమైనవని ‘స్పై వేర్ పెగాసస్’ను విక్రయించే ఇజ్రాయెల్ నిగా సంస్థ ‘ఎన్ఎస్ఓ’ ఓ గ్రూప్ ఖండించింది. దీనిపై కోర్టులో పరువునష్టం దావా వేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది.

లీక్ అయిన డేటా బేస్ ను ప్యారిస్ లోని మీడియా, నాన్ ఫ్రాఫిట్ ఫర్బిడెన్ స్టోరీస్.. అమ్మెస్టీ ఇంటర్నేషనల్ వంటివి పలు పత్రికల్లో పంచుకున్నాయని వైర్ తదితర పత్రికలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణలు అన్నీ తప్పుడువని.. నిరాధారమైన కట్టుకథలు అని ఈ గ్రూప్ తెలిపింది. ఇలాంటివి తమ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తి్తాయని పేర్కొంది.

గుర్తు తెలియని వర్గాలు ఏ విధమైన వాస్తవిక ఆధారాలు లేని సమాచారాన్ని అందజేసినట్టు కనిపిస్తోందని.. ఈ వార్తలను ధృవీకరించే ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేవని దుయ్యబట్టింది. ఇది తప్పుడు సమాచారం అని.. తమ సర్వర్లలో అలాంటి డేటా ఏదీ లేదని వివరించింది.

మా సర్వర్ల నుంచి డేటా లీక్ అయినట్లు చెబుతున్నది అబద్దం.. హాస్యాస్పదం అని పెగాసస్ స్పష్టం చేసింది.అయితే పెగాసస్ ఖండించినా కూడా ఇప్పట్లో ఈ దుమారం ఆగేలా కనిపించడం లేదు. పార్లమెంట్ లోనూ కాంగ్రెస్, ప్రతిపక్షాలు దీనిపై కేంద్రాన్ని టార్గెట్ చేశాయి.