Begin typing your search above and press return to search.

బెజ‌వాడ కోర్టు మాటే క‌రెక్ట్ అన్న సుప్రీం

By:  Tupaki Desk   |   23 July 2015 9:00 AM GMT
బెజ‌వాడ కోర్టు మాటే క‌రెక్ట్ అన్న సుప్రీం
X
ఏపీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌కు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ జ‌రిగాయ‌న్న వాద‌న‌ను ఏపీ స‌ర్కారు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై ద‌ర్యాప్తు జ‌రిపిన విచార‌ణ అధికారులు సైతం ఫోన్లు ట్యాప్ అయ్యాయ‌న్న వాద‌న‌లో బ‌లం ఉంద‌ని ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేల్చ‌టం తెలిసిందే.

ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో.. టెలికం ఆప‌రేట‌ర్ల‌ను కాల్ డేటా ఇవ్వాల్సిందిగా బెజ‌వాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. కాల్ డేలా వివ‌రాల్ని సీల్డ్ క‌వ‌ర్ లో పెట్టి ఇవ్వాల‌ని ఆప‌రేట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేస్తే.. దీనికి అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. వారు సుప్రీంను ఆశ్ర‌యించారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టుకు టెలికం ఆప‌రేట‌ర్లు త‌మ వాద‌న వినిపిస్తూ.. రెండు రాష్ట్రాల మ‌ధ్య తాము న‌లుగుతున్నామ‌ని పేర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారంలో కాల్ డేటాను విజ‌య‌వాడ కోర్టుకు ఇవ్వాల‌ని సుప్రీం పేర్కొంది. విజ‌య‌వాడ కోర్టు పేర్కొన్న గ‌డువులోపు సీల్డ్ క‌వ‌ర్ లో స‌మాచారం ఇవ్వాల‌ని.. అయితే..ఆ స‌మాచారాన్ని మూడు వారాల త‌ర్వాత తెర‌వాల‌ని సుప్రీంకోర్టు సూచించింది.

ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో.. ఇప్ప‌టివ‌ర‌కూ కాల్ డేటా ఇచ్చే విష‌యంలో ఎన్నో వాద‌న‌లు వినిపించిన టెలికం ఆప‌రేట‌ర్లు.. ఇప్పుడు వాటిని విడిచి పెట్టి త‌మ వ‌ద్ద‌నున్న స‌మాచారాన్ని విజ‌య‌వాడ కోర్టుకుఇవ్వాల్సి ఉంటుంది. దీంతో.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం కొత్త మ‌లుపు తిరిగే వీలుంద‌ని చెబుతున్నారు. మ‌రి.. కాల్ డేటాకు సంబంధించి ఏం స‌మాచారం ఉంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.