Begin typing your search above and press return to search.

పోయిన చోటే వెతుక్కుంటున్న మోడీ స‌ర్కార్‌

By:  Tupaki Desk   |   11 Jun 2018 6:20 AM GMT
పోయిన చోటే వెతుక్కుంటున్న మోడీ స‌ర్కార్‌
X
తెలివైనోళ్ల తీరు కాస్త వేరుగా ఉంటుంది. పోయింద‌ని బాధ ప‌డుతూ కూర్చోకుండా.. పోయిన చోటే వెతికే తెలివైన ప‌ని చేస్తారు. తాజాగా.. మోడీ స‌ర్కారు తీరు ఇంచుమించు ఇదే తీరులో ఉంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. తాము అధికారంలోకి వ‌స్తే చాలు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు ఆకాశం నుంచి నేల మీద‌కు తెస్తామ‌ని.. కారుచౌక‌గా ప్ర‌జ‌ల‌కు అందిస్తామ‌ని చెప్ప‌టాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేదు.

దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ కార‌ణంగానే లీట‌రు యాభై కంటే త‌క్కువ ధ‌ర‌కు అందించాల్సిన పెట్రోలు.. సెవ‌న్టీ ప్ల‌స్ చెల్లిస్తామంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. మేం కానీ వ‌స్తేనా? అంటూ ఊరించే సోష‌ల్ మీడియా పోస్టుల‌తో స‌గం భార‌తావ‌ని ఫిదా అయ్యింది. ఎన్నో ఆశ‌ల‌తో మోడీకి ప‌ట్టం క‌డితే.. గ‌డిచిన నాలుగేళ్ల‌లో పెట్రోల్ ధ‌ర కాస్తా రికార్డు స్థాయిలో ఎప్పుడూ లేనంత హైరేంజ్ కి ఎగిసి దేశ ప్ర‌జ‌ల‌కు దిమ్మ తిరిగే షాకిచ్చింది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఆడ‌వారి మాట‌ల‌కే అర్థాలు వేర‌యా అనుకునే వారికి.. మోడీ మాట‌ల‌కు అర్థాలే వేరులే అనుకునే వ‌రకూ విష‌యం వ‌చ్చింది. భారీగా పెరిగిన పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల మీద ఒక్క మాట కూడా మాట్లాడని మోడీ తీరు దేశ ప్ర‌జ‌ల‌కు మ‌రింత మంట పుట్టిస్తోంది.ఇలాంటి వేళ‌లో.. కేవ‌లం ఒకే ఒక్క పైసా త‌గ్గించిన వైనం దేశ వ్యాప్తంగా మోడీ స‌ర్కారుకుచేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ప‌దివేల కోట్ల రూపాయిల స్కాం బ‌య‌ట‌ప‌డినా జ‌ర‌గ‌నంత డ్యామేజ్ పైసా త‌గ్గింపు కార‌ణంగా జ‌రిగింది.

పాడు పైసా అనుకున్నారేమో కానీ.. నాటి నుంచి నేటి వ‌ర‌కూ అంటే.. దాదాపుగా 12 రోజుల నుంచి పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని నెమ్మ‌ది నెమ్మ‌దిగా త‌గ్గిస్తూ వ‌స్తున్నారు. ధ‌ర‌ల్ని పెంచేట‌ప్పుడు జెట్ స్పీడ్ తో భారీగా పెంచేసే తీరుకు భిన్నంగా నాలుగు పైస‌లు.. ఎనిమిది పైస‌లు చొప్పున త‌గ్గిస్తూ.. తాజాగా 24 పైస‌ల వ‌ర‌కూ (ఢిల్లీ ధ‌ర‌ల్లో చూసిన‌ప్పుడు) త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏతావాతా గ‌డిచిన ప‌న్నెండు రోజుల్లో దాదాపు రూపాయిన్న‌ర వ‌ర‌కూ లీట‌రుకు భారం త‌గ్గిన‌ట్లుగా చెబుతున్నారు.

అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ఆధారంగా ధ‌ర‌లు ఉంటాయ‌న్న మాటలు ఉత్త క‌వ‌రింగ్ అని.. అంత‌ర్జాతీయ ముడిచ‌మురుకు కంటే కూడా.. మ‌నోళ్లు వేసే (కేంద్ర‌.. రాష్ట్రాలు) వేసే ప‌న్నుల భార‌మే ఎక్కువ‌న్న మాట ఇప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయింది. నిరంత‌రం భారీ ప‌థ‌కాల్ని ప్ర‌క‌టించే ప్ర‌భుత్వాలు.. వాట‌న్నింటి కంటే ముందు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని భారీగా త‌గ్గిస్తే.. దాని చుట్టూ ఉండే చాలా అంశాల మీద ధ‌రాభారం త‌గ్గిపోవ‌ట‌మే కాదు. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కూడా అందుబాటులోకి వ‌స్తాయ‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. వీటిని ప‌ట్టించుకోకుండా పెంపే ధ్యేయంగా పెంచేసుకుంటున్న ధ‌ర‌లు.. గ‌డిచిన ప‌న్నెండు రోజులుగా త‌గ్గ‌టం శుభ‌ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. ఈ త‌గ్గింపు ఎంత‌వ‌ర‌కూ ఉంటుందో చూడాలి. మోడీ స‌ర్కారు మీద వ్య‌తిరేక‌త పెరిగిపోతున్న వేళ‌.. ఆ వేడి త‌గ్గాలంటే.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో ప్ర‌భుత్వం విశాలంగా ఆలోచించ‌క త‌ప్ప‌దు. మ‌రి.. మోడీ మాష్టారు ఏం చేస్తారో చూడాలి.