Begin typing your search above and press return to search.

ప్ర‌శ్నించే వాళ్లేరి? ప్ర‌జ‌ల‌కు ఏమైంది?

By:  Tupaki Desk   |   25 Oct 2021 4:30 PM GMT
ప్ర‌శ్నించే వాళ్లేరి? ప్ర‌జ‌ల‌కు ఏమైంది?
X
మ‌న దేశంలో ప్ర‌జ‌లు లేరు.. చచ్చిపోయిన వాళ్ల‌తో దేశం నిండిపోయింది.. పెట్రోలు ధ‌ర‌లు పెరుగుతున్నా స్పందించే వాళ్లు లేరు.. ఇదీ టీఎంసీ నేత య‌శ్వంత్ సిన్హా ఆగ్ర‌హంతో చేసిన ట్వీట్ సారాంశం. ఆయ‌న వ్యాఖ్య‌ల్లో ఎంతో నిజం ఉంది. దేశంలోని ప్ర‌జ‌ల్లో ప్ర‌శ్నించే త‌త్వం చ‌చ్చిపోయింది. జాతిలో చేవ త‌గ్గిపోయింది. గ‌తంలో ఎప్పుడో సారి పెట్రోల్ రేట్లు పెంచేవాళ్లు. ఆ పెంపు కూడా పైస‌ల్లోనే ఉండేది. కానీ అందుకు నిర‌స‌న‌గా ఉద్య‌మాలు పెద్ద ఎత్తున జ‌రిగేవి. బంద్‌లు చేప‌ట్టేవాళ్లు. రాస్తారోకోలు ధ‌ర్నాలు అంటూ ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చేవాళ్లు. ప్ర‌జా పోరాటాల‌కు ఎవ‌రు పిలుపునిచ్చిన గొప్ప స్పంద‌న వచ్చేది. కానీ ఇప్పుడు రోజురోజుకూ భారీ స్థాయిలోనే పెరుగుతున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. పెట్రోల రేట్ల విష‌యంపై కేంద్ర మంత్రులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నా ప్ర‌జ‌లు విన‌న‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


పెట్రోల్ ద్వారా 2014లో రూ.75 వేల కోట్ల ప‌న్నుల భారం ప్ర‌జ‌ల మీద ప‌డేది. ఇప్పుడ‌ది రూ.3.50 ల‌క్ష‌ల కోట్లకు పెరిగింది. అయినా అడిగేవాళ్లే లేరు. ఒక‌ప్పుడు ఏవైనా నిర్ణ‌యాలు తీసుకునే ముందు ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు భ‌య‌ప‌డేవి. కానీ ఇప్పుడు ఇష్టారాజ్యంగా ప‌న్నులు పెంచేస్తున్నారు. జ‌నాలు కూడా చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేస్తున్నారు. త‌మ బ‌తుకేదే తాము బ‌తికితే చాల‌న్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. చేవ చ‌చ్చిన వాళ్ల‌లా మారిపోయారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాలంటే భ‌య‌ప‌డుతున్నారు. అడిగితే ఏమ‌వుతుందోన‌నే పిరికిత‌నం జాతిని క‌ప్పేసింది. మ‌న‌కెందుకు వ‌చ్చిన గొడ‌వ అనే ధోరణి పెరిగిపోతోంది. ప్ర‌జ‌ల్లో నిర్లిప్త ధోర‌ణితో ప్ర‌భుత్వాలు రెచ్చిపోతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు ప్ర‌జ‌ల‌ను పట్టించుకోవ‌డం మ‌నేశాయి. ఎక్సైజ్ సుంకం ఏడేళ్ల‌లో 300 శాతం పెరిగింది.. పెట్రోల్ కంటే ఇప్పుడు విమ‌నా ఇంధ‌న‌మే చౌక‌గా మారింది. అయినా స‌రే ఎవ‌రూ కూడా ఇదేంటి అని నిల‌దీయ‌డం లేదు. పెట్రోలు ధ‌ర‌ల‌పై రాజ‌కీయ నాయ‌కుల హ‌డావుడి త‌ప్ప సామాన్య ప్ర‌జ‌ల్లో అస‌లు చ‌ల‌న‌మే లేదు.

ఒక‌ప్పుడు ధైర్యంగా ఉండి ప్ర‌భుత్వాలు త‌ప్పు చేస్తే నిల‌దీసేవాళ్లు ప్ర‌జ‌లు.. ఎంత పెద్ద నేత‌ల‌నైనా రోడ్డు మీద నిల‌బెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడాలంటే భ‌యం. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బంది పెడ‌తారేమోన‌న్న భ‌యం. ప్ర‌జ‌లు రాజ‌కీయాలు మ‌న‌కెందుకు అంటున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు రాజ‌కీయాల‌కు సంబంధం ఏమిటో అర్థం కావ‌డం లేదు. సంఘ‌జీవి అయిన మ‌నిషికి.. స‌మాజాన్ని చూసుకోవాల్సిన బాధ్య‌త ఉంటుంది. వాట్సాప్ ట్విట్ట‌ర్ ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్య‌మాలు ఓ ప‌ది నిమిషాలు ఆగిపోతేనే గ‌గ్గోలు పెట్టే జ‌నం.. ప్ర‌తి విష‌యంపైనా ప్ర‌భావం చూపే పెట్రోల్ రేట్ల‌పై మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఎవ‌రైనా బంద్‌కు పిలుపునిస్తే అస‌లు స్పంద‌నే ఉండ‌డం లేదు. ప్ర‌భుత్వాలు కూడా ఉద్య‌మాలు ప‌ట్టించుకోవ‌డం మానేశాయి. ప్ర‌శ్నించే గొంతులు మూగ‌బోయాయి. మీడియా కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను చూపించే ప‌రిస్థితి లేదు.

లంచం విష‌యంలోనూ ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో జ‌రిగే ప‌నుల‌పైనా ప్ర‌జ‌ల్లో ఇదే అల‌స‌త్యం క‌నిపిస్తోంది. ఈ స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టిగా అడిగిన వాళ్ల‌ను విడ్డూరంగా చూస్తున్నారు. ఏడాదిగా జ‌రుగుతున్న రైతు ఉద్య‌మాల‌పై కూడా ఇదే ప‌ద్ధ‌తి. ల‌ఖింపూర్‌లో రైతుల‌పై కారు ఎక్కించినా ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి రియాక్ష‌న్ లేదు. రైతు ఉద్య‌మంపై ఎవ‌రూ ఆలోచించ‌డం లేదు. గ‌తంలో రైతులంటే ప్ర‌జ‌ల్లో ఓ భావోద్వేగం ఉండేది. కానీ ఇప్పుడు రైతులంటే చుల‌క‌న భావం ఏర్ప‌డుతోంది. గ‌ట్టిగా ఉద్య‌మాలు చేస్తే ప్ర‌భుత్వాలు దిగి వ‌స్తాయ‌నేది గ‌తంలో రుజువైంది. కానీ ఇప్పుడు ఆ దిశ‌గా ప్ర‌జ‌లు ఆలోచించ‌డమే లేదు. క‌నీసం ఎన్నిక‌ల్లోనైనా పార్టీల‌కు బుద్ధి చెబుతున్నారా? అంటే అదీ లేదు. కులం మ‌తం డ‌బ్బు ప్రాతిప‌దిక‌న ఓట్లు వేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి రెచ్చ‌గొడితే చాలు ఓట్లు వ‌స్తాయ‌ని పార్టీలు భావించిన‌ట్లే ప్ర‌జ‌లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. విద్యార్థుల్లోనూ నిర్లిప్త‌త ఆవ‌హించింది. యువ‌త దేశం కోసం ప‌ట్టించుకోవ‌డం మానేసింది. మ‌న‌కెందుకులే అనుకున్నంత కాలం.. ఈ వ్య‌వ‌స్థ‌లో మార్పు రాదు. ఇలాగే ధ‌ర‌లు పెరుగుతూ సామాన్యుల జీవితాల‌ను పిప్పి చేస్తాయి. పోరాడితే పోయేదేముంది? అనుకుని ముంద‌డుగు వేస్తేనే ఏదైనా మార్పు వ‌స్తుంది.