Begin typing your search above and press return to search.

తగ్గేదేలే : రూ.120 కి చేరిన పెట్రోల్ ధర .. హైదరాబాద్‌లో ఎంతంటే !

By:  Tupaki Desk   |   23 Oct 2021 7:30 AM GMT
తగ్గేదేలే : రూ.120 కి చేరిన పెట్రోల్ ధర .. హైదరాబాద్‌లో ఎంతంటే !
X
దేశంలో వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు ఇదే ట్రెండ్ కొనసాగింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశీ ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. నవంబర్‌ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.24పై., లీటర్‌ డీజిల్‌ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్‌ ధర రూ.113.12పై., డీజిల్‌ రూ.104కు చేరింది.

రాజస్థాన్‌ లోని గంగానగర్‌ లో పెట్రోల్‌ ధర రూ.119.42కు చేరింది. ఇదే దేశంలోని హైయెస్ట్ ధర. మధ్యప్రదేశ్‌ లోని సాట్నా, అలిరాజ్‌ పూర్‌ లో ప్రీమియం పెట్రోల్ ధర రూ.120 దాటేసింది. ఇక హైదరాబాద్‌లో అయితే శనివారం పెట్రోల్ ధర పెరిగింది. లీటరుకు 37 పైసలు పైకి కదిలింది. దీంతో పెట్రోల్ ధర రూ.111.55కు చేరింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు 38 పైసలు పెరిగింది. దీంతో డీజిల్ ధర రూ.104.70కు ఎగసింది. బెంగళూరులో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్‌ ట్యాక్స్‌ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ రేటు 35 పైసలు పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.113.18కు చేరింది. డీజిల్ కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర 37 పైసలు పెరుగుదలతో రూ.105.77కు ఎగసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.31 శాతం పెరిగింది. దీంతో బ్రెంట్ ధర 85.72 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 1.79 శాతం పెరిగింది. దీంతో ఈ రేటు 83.98 డాలర్లకు ఎగసింది.

ఇక సెప్టెంబర్‌ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్‌ మీద దాదాపు 6 రూపాయలు, డీజిల్‌ మీద 7 రూపాయలు పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్‌ ధర రూ.9.14కు పెరిగింది.