Begin typing your search above and press return to search.

చరిత్రలో లేనంతగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు

By:  Tupaki Desk   |   18 Sep 2020 4:45 AM GMT
చరిత్రలో లేనంతగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు
X
తియ్యటి మాటలు చెబుతూనే.. బాదేసే విషయంలో ఏ మాత్రం మొహమాటం లేని సర్కారుగా మోడీ ప్రభుత్వాన్ని పలువురు అభివర్ణిస్తుంటారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా.. ధరాభారాన్ని ప్రజల మీద మోపితే జనాగ్రహానికి గురి కావటం తెలిసిందే. ఇలాంటి వాటికి తనదైన రీతిలో చెక్ చెబుతోంది బీజేపీ. ప్రభుత్వాలు విధించే భారాన్ని మోపేందుకు ఇష్టపడకపోవటం కూడా దేశ భక్తి లేనట్లుగా వాదనలు వినిపించటమే కాదు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేయటం కమలనాథులకు మాత్రమే చెల్లుతుందేమో?

గడిచిన కొద్ది నెలల్లో కొన్ని మెసేజ్ లు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి. వాటి సారాంశం.. అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ చార్జీల పెంపుపై సమర్థించుకుంటూ.. రోజులో ఎన్ని టీలు తాగుతున్నాం? కాఫీలు తాగుతున్నాం? ఒక టీ కోసం పది రూపాయిలు ఖర్చు చేస్తున్నాం. అలాంటిది దేశ రక్షణ కోసం.. దేశానికి అవసరమైన ఆయుధాల్ని సమకూర్చుకోవటం కోసం పెట్రో ఉత్పత్తుల ధరల్ని కాస్తా పెంచితే వచ్చే నష్టమేమిటి?

మన దేశం కోసం ఆ మాత్రం తిరిగి ఇవ్వలేమా? పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు మీద మాట్లాడే వారికి కౌంటర్ ఇచ్చేలా ఈ తరహా ప్రచారానికి తెర తీశారు. ఈ కారణంతోనే.. చరిత్రలో ఎప్పుడు లేనంతగా పెట్రోల్ లీటరు ధర పెరిగినా.. కిమ్మనే ధైర్యం చేయటం లేదు. ఇప్పుడు పెరుగుతున్న తీరులోనే పెరుగుతూ పోతే.. మరో రెండు నుంచి నాలుగు నెలల్లో లీటరు పెట్రోల్ రూ.90 పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే ఏపీలో లీటరు పెట్రోల్ రూ.87ను టచ్ చేసేసింది. దానికి కాస్త తక్కువగా తెలంగాణ ఉంది. తెలీకుండానే అప్పుడో పది పైసలు.. అప్పుడో ఐదు పైసలు పెంచేసుకుంటూ పోతున్న పెట్రోల్ ధరలు రానున్న కొద్ది నెలల్లో లీటరు రూ.90ను టచ్ చేయటం.. లీటరు డీజిల్ ధర రూ.85 దాటిపోయే రోజులు ఎంతో దూరం లేవని చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలకు రాబడి బాగా తగ్గిపోయిన నేపథ్యంలో.. పెట్రోల్.. డీజిల్ మీద బాదేయటం ద్వారా వీలైనంత ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నాయి. కేంద్రం మోపే భారాన్ని రాష్ట్రాలు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నా.. తమ రాబడి ఎక్కడ తగ్గుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మౌనంగా ఉంటూ.. కేంద్రాన్ని ఫాలో అయిపోతున్నాయి. ఏతావాతా సగటు జీవి మీద ఈ ధరాభారం పడుతోంది. భారం అంటే.. కమలనాథులకు కోపం వస్తుందేమో?